Revanth Reddy| ధరణి భూతాన్ని వదిలిస్తామన్న హామీ నిలబెట్టుకున్నాం : రేవంత్ రెడ్డి

అధికారంలోకి వచ్చాక ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఆనాడు మేం మాట ఇచ్చాం అని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ధరణి భూతం నుంచి విముక్తి కల్పించాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్ది మంది దొరలకే చుట్టంగా మారిందని, ధరణి(Dharani portal) భూతాన్ని పెంచి పోషించి భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న దొరలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అధికారంలోకి వచ్చాక ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఆనాడు మేం మాట ఇచ్చాం అని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ధరణి భూతం నుంచి విముక్తి కల్పించాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతీ పోరాటం భూమి చుట్టూనే జరిగిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు నాటి సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని గుర్తు చేశారు. భూమిని కన్న తల్లిలా మనమంతా భావిస్తాం అని, భూ యజమానుల హక్కులను కాపాడి , భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత సర్వేయర్లపై పెట్టబోతున్నాం అన్నారు. మీరు తప్పు చేస్తే మీకే కాదు.. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుంది అని హెచ్చరించారు. అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని కోరారు.

పదేళ్లుగా సర్వేయర్ ఉద్యోగ నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని తెలిపారు. ఆ దిశగా ముందుకెళ్లేందుకు మీ సహకారం ఉండాలని కోరారు. రైతే దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుకు అండగా ఉండాలని, తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని సర్వేయర్లకు సూచించారు.