4,092 గురుకుల ఉద్యోగుల సేవల పునరుద్ధరణ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల సేవల కొనసాగింపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపారు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (విధాత): గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల సేవల కొనసాగింపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల విద్యా వ్యవస్థ పై తమ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు.

ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి న్యాయం చేయాలనే మానవతా దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్‌ పద్ధతిలో 2, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 1,545, పార్ట్‌టైమ్‌ విధానంలో 2,102, హానరేరియం పద్ధతిలో 443 మొత్తం 4,092 మంది ఉద్యోగుల సేవలు పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1533 ప్రకారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) పరిధిలో పనిచేస్తున్న 4,092 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు కొనసా గించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయంతో వేతనాల చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది కుటుంబాలకు భారీ ఊరట కలగనుందని మంత్రి పేర్కొన్నారు.

గత కొన్నినెలలుగా కంటిన్యూషన్‌ ఆర్డర్లు లేకపోవడంతో వేతనాల చెల్లింపులో సాంకేతిక ఆటంకాలు తలెత్తి, అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి గుర్తుచేశారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సేవాభావాన్ని గుర్తించి, వారి సేవలను కొనసాగిస్తూ జి.ఓ. 1533 జారీ చేయడం ద్వారా మానవతా దృక్పథాన్ని చూపిందని తెలిపారు. ఇకపై ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లింపుకు మార్గం సుగమమవుతుందని, ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ సేవలను కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉజ్వల భవిష్యత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు . ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపే ప్రజా సంకల్పమని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.