విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ కేసులో త్వరలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిట్ సిద్దమవుతున్నట్లుగా ప్రచారం వినిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావును విచారించిన సిట్ బృందం..ఈ కేసును త్వరగా తేల్చేందుకు దర్యాప్తులో వేగం పెంచింది. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే హరీష్ రావును ఏడున్నర గంటల పాటు విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ పర్వంలో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా…అలాగే సేకరించిన సాంకేతిక ఆధారాల మేరకు కేసీఆర్ ను విచారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్‌లో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని..దీని ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సిట్ బృందం సిద్దమవుతుంది.
కేసీఆర్ ఇంటి నుంచి పేపర్‌పై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నంబర్లు తనకు అందాయని వాటిని ఎస్ఐబీలోని మాజీ డీఎస్పీ
ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయించానని రాధాకిషన్ రావు గత విచారణ సందర్బంగా స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగా కవిత, సంతోష్ రావులను విచారించి ఆ తర్వాత కేసీఆర్‌ను విచారించాలని సిట్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎవరి ఆదేశాల మేరకు విపక్ష నేతలు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్టులు ఫోన్లు రికార్డ్ అయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ విచారణతోనే కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు భావిస్తుండటంతో త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ప్రచారం వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
CRPF Officer Simran Bala | మరో చరిత్ర సృష్టించబోతున్న భారత నారీ..గణతంత్ర వేడుకలే వేదిక!
Bill Gates | వైట్‌కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు.. హెచ్చరించిన బిల్ గేట్స్
