Vande Bharat Sleeper | దక్షిణ మధ్య రైల్వేకు వందే భారత్‌ స్లీపర్‌ రైలు..! ఏ మార్గంలో కూతపెడుతుందో తెలుసా..?

Vande Bharat Sleeper | ప్రస్తుతం వందే భారత్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉండడంతో మరికొన్ని రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. అయితే, ఈసారి వందే భారత్‌ స్లీపర్‌ రైలును స్లీపర్‌ రైలును ప్రారంభించే యోచనలో ఉన్నది.

  • Publish Date - June 17, 2024 / 09:53 AM IST

Vande Bharat Sleeper | ప్రస్తుతం వందే భారత్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉండడంతో మరికొన్ని రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. అయితే, ఈసారి వందే భారత్‌ స్లీపర్‌ రైలును స్లీపర్‌ రైలును ప్రారంభించే యోచనలో ఉన్నది. తొలి విడుదతలో సికింద్రాబాద్‌-పుణే మధ్య ఈ వందే భారత్‌ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించే  కసరత్తులు చేస్తున్నది. దేశంలో తొలిసారిగా రాబోయే రెండునెలల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైలు పరుగులు తీయబోతున్నది.

ఆగస్టు 15 నాటికి స్లీపర్‌ వెర్షన్‌ ట్రయల్స్‌ను పూర్తి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, తొలి విడతలో స్లీపర్‌ రైలును తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వేబోర్డు ప్రతిపాదనలు కోరింది. భారీగా రద్దీ ఉండే సికింద్రాబాద్‌-పుణే రూట్‌లో స్లీపర్‌ రైలును కేటాయించాలని అధికారులు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం మార్గంలో సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు స్లీపర్‌ వెర్షన్‌ రైళ్లను సైతం కేటాయిస్తే మరింత ఆక్సుపెన్సీ పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్‌, విజయవాడ-చెన్నై, కాచిగూడ-యశ్వంత్‌పూర్‌, సికింద్రాబాద్‌-తిరుపతితో పాటు పలుమార్గాల్లో వందే భారత్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లు వందశాతం ఆక్యుపెన్సీ రేటుతు నడుస్తున్నాయి. అయితే, సికింద్రాబాద్‌-పుణే మధ్య సైతం వందే భారత్‌ రైలును ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే భావించింది. తాజాగా స్లీపర్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 వందే భారత్‌ రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రైళ్ల వేగంతో పోలిస్తే అదనపు వేగంగా, అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఇతర రైళ్లతో పోలిస్తే టికెట్ల ధరలు అధికంగానే ఉన్నా.. త్వరగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రయాణికులు వందే భారత్‌ రైళ్లను వినియోగించుకుంటున్నారు. అయితే, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రైల్వేశాఖ వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే వేగంతో పాటు అదనంగా సౌకర్యాలను ప్రయాణికులను కల్పించబోతున్నది. ఈ స్లీపర్‌ రైలు కోచ్‌లు చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్.. ఈ కోచ్‌ను డిజైన్‌ చేసింది. అయితే, వందే భారత్ స్లీపర్ రైళ్లను రెండునెలల్లోనే పట్టాలపైకి తీసుకురాబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల వెల్లడించారు. ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా స్లీపర్‌ బెర్తులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

ఫ్రంట్ నోస్ కోన్ నుంచి టెయిల్ ఎండ్ వరకు అన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. ఇంటీరియర్ ప్యానెల్స్, సీటింగ్, బెర్త్‌, లైటింగ్, కోప్లర్స్, గ్యాంగ్‌వే ఇలా అన్ని అంశాలను ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. బీఈఎంఎల్ ఇచ్చిన డిజైన్లను క్షుణ్నంగా పరిశీలించాకే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా 250 స్లీపర్‌ రైళ్లను నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌ను తొలి విడుతలో వివిధ మార్గాల్లో నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తున్నది. భువనేశ్వర్‌-విశాఖపట్నం, తిరుపతి-చెన్నైతో పాటు వివిధ రూట్లను సైతం పరిశీలిస్తున్నది. తొలి రైలు ప్రారంభించిన అనంతరం వివిధ మార్గాల్లో నడిపేందుకు సిద్ధమవుతున్నది.

Latest News