ఈసారి అసెంబ్లీలో పది మంది మహిళలు

తెలంగాణ మూడో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల్లో కేవలం 9మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

  • కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. బీఆరెస్ నుంచి నలుగురు
  • ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు

విధాత : తెలంగాణ మూడో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల్లో కేవలం 9మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలుంటే ఈ దఫా ముగ్గురు పెరిగారు. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ నుంచి, నలుగురు బీఆరెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో నారాయణ్‌పేట్ నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, కోదాడ నుంచి పద్మావతి ఉత్తమ్‌, పాలకుర్తిలో మామిడాల యశస్వినిరెడ్డి, ములుగు(ఎస్టీ) ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పడమరలో కొండా సురేఖ, సత్తుపల్లి (ఎస్సీ) డాక్టర్‌ మట్టా రాగమయిలు ఉన్నారు.

బీఆరెస్ నుంచి గెలిచిన మహిళా అభ్యర్థుల్లో అసిఫాబాద్‌(ఎస్టీ)- కోవ లక్ష్మి, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి, మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ (ఎస్సీ) లాస్య నందిత ఉన్నారు. ఈసారి అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి (26) ఉండబోతున్నారు. తన ప్రత్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఓడించి శాసన సభలో తొలిసారి అడుగుపెడుతున్నారు. చిట్టెం పర్ణికారెడ్డి బీఆరెస్ అభ్యర్థి ఎస్‌ రాజేందర్‌రెడ్డిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీకి వస్తున్నారు. కంటోన్మెంట్‌లో తన తండ్రి దివంగత సాయన్న సిటింగ్ స్థానంలో పోటీ చేసిన బీఆరెస్ అభ్యర్థి లాస్య నందిత బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌పై విజయం సాధించారు.


ఆమెతో పాటు సత్తుపల్లిలో బీఆరెస్ అభ్యర్ధిపై సండ్ర వెంకటవీరయ్యపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ మట్టా రాగమయి కూడా ఈమె కూడా అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారి. సబిత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో, సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కొండా సురేఖ, సునీతా లక్ష్మారెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. కోవ లక్ష్మి, పద్మావతి, సీతక్క ఇంతకుముందు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పోటీలో 221 మంది.. గెలిచింది 10మంది

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 2,990 మంది పోటీ పడగా, వారిలో 221మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వారిలో 36మందిని ప్రధాన పార్టీలు పోటీకి దించాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 13మందికి, బీఆరెస్ 8మందికి, బీజేపీ అత్యధికంగా 13మందికి, బీఎస్పీ 9మందికి, జనసేన ఒకరికి అవకాశం ఇచ్చాయి. ఒక ట్రాన్స్ జెండర్ కూడా పోటీ చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి 6గురు, బీఆరెస్ నుంచి 4గురు మాత్రమే గెలువగా, మిగతా వారంతా ఓటమి చెందారు.


2018 ఎన్నికల్లో 140 మంది పోటీ చేశారు. వారిలో ప్రధాన పార్టీల నుంచి 30 మంది పోటీ పడ్డారు. వారిలో ఆరుగురు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. బీఆరెస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. బీఆరెస్ నుంచి ఆలేరులో గొంగిడి సునీత, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఖానాపూర్‌లో రేఖానాయక్‌, మెదక్‌లో పద్మా దేవేందర్‌రెడ్డి గెలువగా, ఇల్లెందు నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన హరిప్రియ బీఆరెస్‌లో చేరి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో ములుగు నుంచి సీతక్క మాత్రమే గెలిచారు.