Speaker Investigating Defecting MLAs | ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో స్పీకర్ బిజీ

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విచారణ శనివారం జరిగింది.

telangana-assembly-speaker-gaddam-prasad-hearing-on-defected-mlas

విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‍లపై విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో కొనసాగిన విచారణకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి , బండ్ల కృష్ణమోహన్ రెడ్డిహాజరయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లను పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యదయ్య, ప్రకాశ్ గౌడ్ లను విచారించాల్సి ఉంది. కాలే యదయ్యకు విచారణకు ఎక్కువ సయమం పట్టడంతో గూడెం, బండ్ల విచారణ ప్రక్రియను శనివారానికి వాయిదా వేశారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు అమలు చేశారు. ప్రస్తుతం గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్ ల విచారణ పూర్తి కావడంతో.. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన షెడ్యూల్ ను స్పీకర్ ప్రసాద్ త్వరలో విడుదల చేయవచ్చు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సంజయ్‌ కుమార్‌, గూడెం మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ పిటిషన్‌ ఇచ్చింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించడంలో మూడు నెలల్లోగా వారి అనర్హత అంశం తేల్చాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచిస్తూ జూలై 31న తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు విచారణ ప్రక్రియను ప్రారంభించిన స్పీకర్‌ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మందీ తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ల పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులు కూడా వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు.

 

Exit mobile version