Site icon vidhaatha

Telangana Budget 2024 | రూ. 2,91,159 కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌.. కేటాయింపులు ఇలా..

విధాత: తెలంగాణ రాష్ట్ర 2024-25 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క గురవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పించారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయరంగానికి 72,650 కోట్లు కేటాయించినట్లుగా భట్టి వెల్లడించారు. ఇది రైతుల తలరాతలను మార్చే బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని మహాకవి దాశరథి చెప్పిన తెలంగాణను సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని చెబుతూ భట్టివిక్రమార్క తన బడ్జెట్ ప్రసంగం ఆరంభించారు.

గత పదేళ్లలో అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి తమ ప్రభుత్వం నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన గత పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పురోభివృద్ధి లేకపోగా రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లి, అభివృద్ధి అడుగంటి రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. రాష్ట్ర అవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్లకు చేరందని భట్టి వివరించారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర అప్పు 10 రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన అప్పులు.. పెండింగ్ బిల్లుల బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుందని తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా నడపాల్సిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెత్తుపోకడలతో స్వంత జాగీరులా నడిపారని, ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం తమకు వారసత్వంగా అందిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటికి కుంటుపడి ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తాము ఎదుర్కొన్న పెను సవాలు అని తెలిపారు. తలకు మించిన రుణ భారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించామని, తద్వారా ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు సకాలంలో జీతాలు చెల్లించే వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. ఈ ఏడాది మార్చి నుంచి 3.69 లక్షలప్రభుత్వ ఉద్యోగులకు, 2.87లక్షల పెన్షన్‌దారులకు ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు పెన్షన్‌లు చెల్లిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

6,71,757 కోట్ల అప్పు

డిసెంబర్ 2023లో తమ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నాటికి రూ.6,71, 757 కోట్ల అప్పు ఉన్నట్లు తేలిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులైనప్పటికీ ప్రభుత్వపరంగా బాధ్యతతో వాటిని తీర్చుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణం తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రుణ బకాయిలను చెల్లించామని వివరించారు. అంటే తమ ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా రూ.7,774 కోట్లు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించామని తెలిపారు.

ఆర్థిక సమస్యలు జటిలంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు డిసెంబర్ నాటికి 34,579 కోట్లను వివిధ పథకాల ద్వారా ఖర్చు చేశామన్నారు. ఈ పథకాలలో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు, చేయూత ఉన్నాయన్నారు, సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని, పోలీసు, వైద్య, ఇతర రంగాల్లో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇదివరకు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు.

రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్..
రెవెన్యూ వ్య‌యం రూ. 2,20,945 కోట్లు
మూల ధ‌న వ్య‌యం రూ. 33,487 కోట్లు

బ‌డ్జెట్ కేటాయింపులు ఇలా..

హోం శాఖ రూ. 9,564 కోట్లు
వ్య‌వ‌సాయం – రూ. 72,659 కోట్లు
వైద్యం, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 22,301 కోట్లు
విద్యారంగం రూ. 21,292 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు

ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల శాఖ రూ. 2,762 కోట్లు
ఐటీ రంగం రూ. 774 కోట్లు

అడ‌వులు, ప‌ర్యావ‌ర‌ణం రూ. 1,064 కోట్లు
ఉద్యాన‌వ‌నం రూ. 737 కోట్లు
ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌కు రూ. 1,980 కోట్లు

రూ. 500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం కోసం రూ. 723 కోట్లు
గృహ‌జ్యోతి ప‌థ‌కం కోసం రూ. 2,418 కోట్లు
ప్ర‌జా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు
పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు
ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి రూ. 50.41 కోట్లు

జీహెచ్ఎంసీ ప‌రిధిలో కేటాయింపులు ఇలా..

మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ – రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ – రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న – రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న రూ. 500 కోట్లు
విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ రూ. 100 కోట్లు
హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 500 కోట్లు
మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ రూ. 50 కోట్లు
ఔట‌ర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు

సంక్షేమానికి కేటాయింపులు ఇలా..

బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు

Exit mobile version