Site icon vidhaatha

ఒకే విడుతలో రుణమాఫీ.. రైతుల సంక్షేమం కోసమేనన్న సీఎం రేవంత్‌

Telangana Cabinet Meeting

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
రుణమాఫీలో ఎలాంటి శషభిషలు లేవు
వరంగల్‌ డిక్లరేషన్‌ అమలు చేస్తున్నాం
2023 డిసెంబర్‌ 9కి ముందు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ ఒకే దఫాలో మాఫీ
రుణమాఫీకి సుమారు రూ.31 వేల కోట్లు
రైతుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం
ఇచ్చిన మాట 8 నెలల్లోనే నిలబెట్టుకుంటున్నాం
రైతు భరోసాను పారదర్శకంగా అందిస్తాం
అందుకోసం భట్టి నేతృత్వంలో ఉపసంఘం
జూలై 15లోగా ప్రభుత్వానికి సబ్‌కమిటీ నివేదిక
అసెంబ్లీలో పెట్టి, అందరి సూచనలతో అమలు
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలక హామీ అమలుకు రంగం సిద్ధమైంది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఇదే అంశంలో అంతకు ముందు సమావేశమైన ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది.

ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయనున్నారు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ సమావేశంలో చర్చించామని తెలిపారు.

వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని చెప్పారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే అని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనమని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28వేల కోట్లు అని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసిందని, తమ ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని వివరించారు.

రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోందని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని చెప్పారు. రైతు భరోసా విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇచ్చారనే చర్చ జరుగుతున్నదని తెలిపారు. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించామని ప్రకటించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారని, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపారు.

జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని చెప్పారు. ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి, అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారని తెలిపారు. వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలని కోరారు. రుణమాఫీపై తినబోతూ రుచులెందుకన్న సీఎం.. రైతు రుణమాఫీ చేసి తీరుతామని, దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదని చెప్పారు. నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తామని తెలిపారు.

 

Exit mobile version