Telangana Cabinet | హైదరాబాద్, విధాత : ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నది. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపును హైకోర్టు నిలిపివేయడం, బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్, కర్నాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రధాన అంశాలుగా ప్రధానంగా చర్చ జరగనుంది. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్లకు 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లులు పాస్ చేసి గవర్నర్, రాష్ట్రపతికి పంపించడం, ఆర్డినెన్స్ జారీ తరువాత జీఓ లు జారీ చేసి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగానికి విరుద్ధంగా 50 శాతం రిజర్వేషన్లు దాటుతుండడాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేయడంతో, జీఓ అమలుపై ఆరు వారాల పాటు స్టే ఇచ్చిన విషయం విదితమే.
అయితే పాత విధానం ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని, 50 శాతం పరిమితి దాటకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తరువాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై మంత్రిమండలి సమావేశంలో చర్చించి స్థిర నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన అంశాలు, న్యాయ నిపుణుల వెల్లడించిన అభిప్రాయంపై చర్చించనున్నారు. ఒక వేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందనే దానిపై కూడా అభిప్రాయాలు సేకరించనున్నారు. అలాగే, ఏపీలో పోలవరం, బనకచర్ల మధ్య లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం రెండు రోజుల క్రితం టెండర్ ఆహ్వానించారు.
అయితే ఈ లింకు ప్రాజెక్టుపై తొలి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరగా, తాజాగా కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కూడా తెలంగాణ కు లేఖ రాసింది కూడా. తెలంగాణ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై ప్రస్తుత ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచనున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే మరణ శాసనం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీనిపై సుప్రీంకోర్టు లో కేసు నడుస్తున్నదని, తమ వాదనలు కూడా వినిపిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కు రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతో అయినా తాము కొట్లాడతామన్నారు. గతంలో ఈ డ్యామ్ ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6కు పెంచిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఎత్తు పెంపును ఎలా నిలువరించాలని, ముందున్న మార్గాలపై ఆరాతీయనున్నారు. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ, ఫార్ములా ఈ రేసు కేసులో రాష్ట్ర గవర్నర్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిపై అనుసరిస్తున్న వైఖరి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలున్నాయి. అయితే ఎజెండా అంశాలు ఇప్పటి వరకు ఖరారు కానప్పటికీ, ప్రధానంగా ఈ అంశాలే ఎజెండాలో ఉండవచ్చని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.