Musi River । మూసీ సుందరీకరణ విషయంలో బీఆరెస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మూసీ రివర్‌ఫ్రంట్ విషయంలో చేసిన ప్రతిపాదనలకు సంబంధించిన మినిట్స్‌ను మంగళవారం విడుదల చేసింది. బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి 09.07.2018న MRDCL అధికారులతో నిర్వహించిన సమావేశంలో నదిలో, బఫర్ జోన్‌లో ఉన్న ఆక్రమణలను నెల వ్యవధిలో లెక్కించాలని, నది సరిహద్దును నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే విసయంలో ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. ఆక్రమణలు తొలగించేందుకు, పునరావాసం కల్పించేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించాలని కూడా ఆ సమావేశంలో చర్చించారు. దీనిని ప్రాధాన్య అంశంగా తసీఉకుని మూసీ పునరుద్ధరణకు ఒక మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని కూడా సమావేశంలో చర్చించారు. మూసీకి ఇరువైపులా నాలుగు లేన్ల రహదారులను అభివృద్ధి చేసేందుకు కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను MRDCL సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్డు జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 అడుగులు, జీహెచ్‌ఎంసీ వెలుపల అంటే.. ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకూ 42 కిలోమీటర్ల మేర 150 అడుగులతో రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు.
30.06.2020న ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు. బృందాలను ఏర్పాటు చేసుకుని డీమార్కేషన్ ప్రక్రియను ప్రారంభించాలని భావించారు. 25.06.2021న నిర్వహించిన మరోసమావేశంలో హెచ్‌ఆర్‌డీసీఎల్ మూసీ నదిపై 14 వంతెనలు నిర్మించాలని నాటి మంత్రి ప్రతిపాదించారు. ఫ్రెష్ వాటర్స్‌ను నిల్వ చేయడం ద్వారా పర్యాటకకం, బోటింగ్ కోసం ఒక చెక్‌డ్యామ్ కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుతో నిర్వాసితులయ్యేవారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. 28.01.2022న జరిగిన మరొక సమావేశంలో మూసీ రివర్‌బెడ్, బఫర్‌జోన్‌లో 8,480 నిర్మాణాలు ఉన్నట్టు MRDCL, రెవెన్యూ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. వాటికి విలువ కట్టి.. అందుబాటులో ఉన్న చోట నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.