సాదాబైనామాల రైతులకు విముక్తి
హైకోర్టు తీర్పుతో 9 లక్షల మందికి మేలు
అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం
ఇకపై శాశ్వత యజమాన్య హక్కులు
10 లక్షల ఎకరాలకు 13బీ ప్రాసీడింగ్స్
రాష్ట్రంలో తగ్గనున్న భూ వివాదాలు!
హైదరాబాద్, ఆగస్టు 26 (విధాత): తెలంగాణలో ఎట్టకేలకు సాదాబైనామా రైతులకు విముక్తి లభించింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న 9 లక్షల 894 సాదాబైనామా దరఖాస్తులను రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) భూ భారతి- 2025 చట్టం ప్రకారం క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ తీర్పుతో 2020లో ధరణి చట్టం వచ్చినప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ కానున్నాయి. సాదాబైనామా దరఖాస్తులను క్లియర్ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు ఈ మేరకు హై కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో అఫిడవిట్ సమర్పించి క్రమబద్దీకరణకు ఉన్న అడ్డంకులను తొలగించింది. 10 లక్షల ఎకరాల భూమి ఉన్న 9 లక్షల 894 మంది రైతులకు భూ యజమాన్య పట్టాలు వచ్చే విధంగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులంతా పార్ట్ (బీ)లో ఉన్న 10 లక్షల ఎకరాల భూమి క్లియర్ అవుతుందని ఊపిరి పీల్చుకున్నారు. దరఖాస్తుదారులు ఇప్పటికైనా తమ సమస్య తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో సగం భూమి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన అనేక గ్రామీణ ప్రాంతాలలో చిన్న, పేద, నిరుపేద రైతులు కూలినాలి చేసి సంపాదించుకున్న కొద్దిపాటి సొమ్ముతో ెకరా, అరక ఎకరా, ఎకరంన్నర, రెండు ఎకరాలు ఇలా తమకు చేతనైనంత భూమిని కొనుగోలు చేశాశారు. రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేక కొంత మంది, భూ యజమానికి డబ్బులు చెల్లించిన తరువాత రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టలేక కొంత మంది నోటి మాట, తెల్లకాగితాలు, బాండ్ పేపర్లపై ఒప్పందాలతో డబ్బులు చెల్లించి భూములను కొనుగోలు చేసుకున్నారు. భూ యజమానులకు, కొనుగోలు దారులకు మధ్య తెల్ల కాగితమే కానీ మరే ఆధారం లేదు. అయితే తెలంగాణ సమాజంలో మాట మీద ఉన్న నమ్మకమే అనేక లావాదేవీలకు కారణం అవుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ తప్పని సరి అన్నది ఏమి లేకుండా మాటమీదనే నడిచింది. అయితే అమ్మకాలు కొనుగోళ్లు జరిగినా రికార్డులలో అమ్మిన భూమి యజమాని పేర్లే వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం రైతులకు కల్పించే ప్రయోజనాలు ఈ నిరుపేద రైతులకు దక్కడం లేదు.
గతంలో ప్రతి ఏటా జమాబందీ జరిగేది. ఆ సందర్భంగా రెవెన్యూ అధికారులు గ్రామంలోనే ఉండి విచారణ జరిపి, ఎవరైనా రైతులు భూమి క్రయవిక్రయాలు చేస్తే వాటి యజమాన్య హక్కులను కొనుగోలు దారులకు కల్పిస్తూ రికార్డులు సరి చేసేవారు. అయితే క్రమేణా జమాబందీకి వరుస ప్రభుత్వాలు ఎగనామం పెట్టాయి. దీంతో ఇలాంటి క్రయవిక్రయాల విషయంలో యజమాన్య హక్కుల మార్పు జరగకుండా పెండింగ్‌లో పడిపోయింది.
సాదాబైనామా పత్రాలున్న రైతులందరికీ 13–బీ ప్రొసీడింగ్‌లను జారీ చేసి పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని గత ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. 2014 జూన్ 2 కంటే ముందు తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన రైతుల నుంచి (పట్టణాల్లో అవకాశం లేదు) దరఖాస్తులను స్వీకరించింది. మొదటి విడతలో సుమారు 12,64,000 మంది రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పానుపుస్తకం చట్టం-1971 ప్రకారం ఆర్హులైన రైతులకు 13–బీ ప్రాసీడింగ్స్ జారీ చేసి, సుమారు 6లక్షల మందికి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించింది.
ఆతరువాత కూడా రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సాదాబైనామాలకు మరోసారి ఆవకాశం ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 18, అక్టోబర్ 2021న సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అనుమతినిస్తూ 112 జీవో విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ వరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది. సుమారు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మళ్లీ 10 నవంబర్ 2020 తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచగా, అదే నెల అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు 11 రోజుల వ్యవధిలో సుమారు 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సాదాబైనామాల రెండవ విడత క్రమబద్ధీకరణకు మొత్తం 9,00,894 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు గత ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో 30, అక్టోబర్ 2020న ధరణి చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం సాదాబైనామాలకు అవకాశం లేదనందున రద్దు అయిన ఆర్వోఆర్ చట్టం ప్రకారం సాదాబైనామా దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారు? ఎలా క్రమబద్దీకరిస్తారు? అని ఒకరు పిల్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు 2020 అక్టోబర్ 29వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే అక్టోబర్ 29వ తేదీలోపు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 13–బీ పత్రాలను జారీ చేయవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ ఆదేశాలు కూడా అమలుకు నోచుకోలేదు. తాజాగా 2020 అక్టోబర్ 30వ తేదీ లోపు స్వీకరించిన 2,26,693 దరఖాస్తులను, అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్స్ ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించవచ్చని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మొత్తం 9లక్షల 894 దరఖాస్తులకు మోక్షం కలిగింది.
తీర్పును స్వాగతించిన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్
సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల కేసులో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సాదాబైనామాలకు శాశ్వత హక్కులు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే రామకృష్ణ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనిని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో సుమారు 9 లక్షల 894 మంది రైతులకు మేలు జరగడంతో పాటు సుమారు 10 లక్షల ఎకరాల భూములకు 13–బీ ప్రొసీడింగ్స్ జారీ అవుతాయని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ సంపూర్ణం అయితే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సాదాబైనామ రైతులకు ఊరట లభిస్తుందని తెలిపారు.