బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ కు లైన్ క్లియర్ ?

రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో రాజేందర్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది

  • Publish Date - June 11, 2024 / 12:27 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన బలాన్ని చాటింది. గతంలో గెలిచిన నాలుగు సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా అదనంగా మరో నాలుగు సీట్లను కాషాయపార్టీ తన ఖాతాలో వేసుకున్నది. అలాగే కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మరోసారి మంత్రి పదవి వరించింది. ఈసారి కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్ వచ్చింది. మరో కీలక నేత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి కేబినెట్‌లో చోటు దక్కింది.

కేంద్రంలో మంత్రి పదవి ఆశించిన ఈటల రాజేందర్‌ను ఈసారి అవకాశం లభించలేదు. అయితే రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో రాజేందర్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాత కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని అధిష్ఠానం సూచించినా అది ఫలించలేదు. దీంతో ఆపార్టీ ఆశించిన సీట్లు లభించలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తింది. మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో ఈటల ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తద్వారా పార్టీకి విధేయుడిగా ఉంటే కొత్త, పాత తేడా లేకుండా పదవులు కట్టబెడుతామనే సంకేతం ఇవ్వదలుచుకున్నట్టు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్‌సభ ఎన్నికల్లో 8, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధిస్తామన్నారు. ఒడిషాలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడం ఆపార్టీ దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. అలాగే తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ప్రచారం చేస్తున్నది. అయినా 2014, 2018, 2023 లలో ఆపార్టీ ఆశించిన సీట్లు దక్కలేదు. ఈసారి అదే వ్యూహాన్ని మరోసారి అమలు చేసే అవకాశం లేకపోలేదు. ఈటల పార్టీలోకి వచ్చాయ, బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీలో రెండు మూడు గ్రూపులు అయ్యాయనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు బండి సంజయ్‌ని తప్పించడమే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తక్కువ సీట్లకే పరిమితం కావడానికి కారణమనే వాదాన్ని ఎంపీ అర్వింద్‌ తోసిపుచ్చారు. ఆయన అధ్యక్షుడు కాకముందే బీజేపీ ఎంపీ సీట్లను, ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్నదన్నారు. పార్టీలో అంతర్గత కలహాలకు చెక్‌ పెట్టి పార్టీని పటిష్టం చేసే కార్యాచరణను కమలనాథులు మొదలుపెట్టవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈటలకు లైన్‌ క్లియర్‌ అయినట్టే భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News