విధాత, హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana panchayat elections)కు సంబంధించి తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగనుంది. గ్రామాల్లో ఓటు వేసేందుకు బయలుదేరిన ఓటర్ల కారణంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్(Hyderabad traffic jam) అయ్యింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలి పురం, హయత్ నగర్ మార్గంలో, ఇటు ఉప్పల్, నారాపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఉదయం చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఓటర్లు ఇళ్ల నుండి పోలింగ్ కోసం ఆలస్యంగా ఇళ్ల నుంచి గ్రామాలకు ప్రయాణమయ్యారు. నగరంలోని ఓటర్లను పిలుపించుకునేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు ముందుగానే వారికి ప్రయాణ ఖర్చులు, ఇతన నజరానాలు అందించారు. కొన్ని పంచాయతీల అభ్యర్థులు ఓటర్లకు ప్రత్యేక బస్సులు, వాహనాలు సైతం సమకూర్చారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కోసం ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
తొలి విడతలో 189మండలాలల్లోని 4236గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగాల్సి ఉండగా..అందులో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 3,834పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 5గ్రామాల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరుగడం లేదు. 9,633వార్డు సభ్యులు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27,628వార్డులకు పోలింగ్ జరుగుంది. 37,562పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 56,19,430మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
