42శాతం పైన పార్టీల ద్వంద్వ వైఖరి
ఎవరి చిత్తశుద్ధి ఎంతనే ప్రశ్నలు
రెండు నాల్కల ధోరణిలో నేతలు
హక్కులివ్వడంలో పార్టీల నిర్లక్ష్యం
బీసీల అనైక్యతే పార్టీలకు ఆయుధం
తాబేదార్లుగా మారిన బీసీ సంఘాలు
BC Reservations | విధాత, ప్రత్యేక ప్రతినిధి: బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే 42శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపైన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అనుకూల రాజకీయాలకు తెరతీశాయి. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో బీసీల అంశంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పార్టీలు తమ ముసుగులు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామాలను బీసీలు నిశితంగా పరిశీలిస్తున్నారని ఆ సంఘాల నాయకులు గుర్తుచేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు సీఎం సహా మంత్రులు, ప్రజాప్రతినిధులంతా తరలివెళ్ళి ధర్నా చేపట్టడంతో ఈ చర్చ పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ మూడు పార్టీలకు బీసీలపట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీసీలకు హక్కులు దక్కడం లేదనే చర్చసాగుతోంది. ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లునినోట్లో శని ఉన్నట్లుగా’ ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన ముఖ్యమైన నేతలంతా బీసీలపైన ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ల పైన మూడు ప్రధాన పార్టీలు సమర్ధిస్తున్నా…ఎందుకు 42శాతం బీసీల రిజర్వేషన్ల బిల్లు అమలుకు నోచుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా పార్టీలలోని బీసీ నాయకులు తమ పార్టీల అధినాయకత్వం తీరును నిలదీయకుండా తాబేదార్లుగా వ్యవహరించడం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తుతోందని, పార్టీల చిత్తశుద్ధిని శంకిస్తున్నారు.
రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి
బీసీ రిజర్వేషన్లు, బీసీల పట్ల పార్టీలలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఎంత అనే కీలక చర్చ ప్రారంభమైంది. ఏ పార్టీ ఏవిధంగా బీసీలను మభ్యపెడుతోందీ? ఏ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ… రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. బీసీల పట్ల ప్రధాన రాజకీయ పార్టీల సర్కస్ ఫీట్లను, ఆయా పార్టీలలోని బీసీ నాయకులు తమ సామాజిక వర్గాన్ని మభ్యపెట్టేందుకు పడుతున్న పాట్లను చూసి నవ్వుకుంటున్నారు. ఆధిపత్యవర్గాలకు కొమ్ముకాస్తూ తమ స్వంత ప్రయోజనాల కోసం మొత్తం సమూహ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న తీరుపైన మండిపడుతున్నారు. ఈ పార్టీల్లోని బీసీ నాయకుల దాసోహాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీల అనైక్యతే పార్టీలకు వరం
అంతటా బీసీలే మెజార్టీ జనాభాగా, ఓటర్లుగా ఉన్నప్పటికీ అన్నింటా వివక్షను అనుభవిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినప్పటికీ అన్ని రంగాల్లో పేరుకుతగ్గట్లు వెనుకబాటుతనానికి నిదర్శనంగా కొనసాగుతున్నారు. అధికారికంగా నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలో 56శాతం బీసీలున్నట్లు ప్రకటించారు. మెజార్టీగా ఉన్నప్పటికీ బీసీల మధ్య అనైక్యతే మిగిలిన వారికి, ఆధిపత్యవర్గాల పార్టీలకు శ్రీరామ రక్షగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో ప్రారంభమైన ఈ చర్చ తాజాగా ఢిల్లీ ధర్నాతో ప్రధానాంశంగా మారింది. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీతో పాటు అనేక హామీలిచ్చినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం అమలుకు ప్రయత్నిస్తే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.
బీసీలపట్ల పార్టీల చిత్తశుద్ధి ఎంత?
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ రాష్ట్రంలో కులగణనతోపాటు, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులపైన సమగ్ర సర్వే చేపట్టింది. ఇచ్చిన హామిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మిగిలిన పక్షాలకు బీసీలపట్ల చిత్తశుద్ధి ఉంటే సహకరించాలి, ఆ పార్టీల్లోని బీసీ నేతలు పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెచ్చి అమలుకు మద్ధతు తెలుపాలి. ఇవన్నీ చేతగాకపోతే ప్రేక్షకపాత్ర వహించాలి. అమలు చేస్తామని చెప్పి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నిజాయితీలేకుంటే వారి ఆచరణను ప్రజల్లో ఎండగట్టాలి.. కానీ, ఇక్కడే తిరకాసు ఉన్నది. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు ముందుగానే కులగణనకు దూరంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కులగణనలో పాల్గొనాల్సి ఉండే. కానీ, ఆ పార్టీల్లోని బీసీలు ఈ నాయకులపై కనీస ఒత్తిడితేకుండా వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రత్యర్ధి పార్టీలను ప్రశ్నించడం సిగ్గుచేటనే విమర్శలున్నాయి. కులగణను తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపించారు. ఈ బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. మరోవైపు సెప్టెంబర్ చివరినాటికి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50శాతం మించకుండా తెచ్చిన బిల్లును మార్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్సు తెచ్చి గవర్నర్‌కు పంపించింది. ఈ ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడంతో పీటముడి పడింది.
బీసీల అంశాన్ని పక్కనపెట్టి ‘రాజకీయం’
అధికార కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్ చార్జ్ , నేతలు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ధర్నా నిర్వహించడం విశేషంగా చెబుతున్నారు. ఇందులో ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలున్నప్పటికీ ఈ ధర్నా చరిత్రలో నిలిచిపోతోందంటున్నారు. గతంలో ఒకటి, రెండు ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఏ పార్టీ, ప్రభుత్వం ఈ స్థాయిలో ఆందోళనకు సిద్ధమైన సందర్భంలేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నిరసన చేపడితే బీజేపీకి కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటే దాన్ని పక్కనపెట్టి బీసీల కోసం బిల్లు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, కాంగ్రెస్, బీజేపీల ఆధిపత్య రాజకీయాలకు బీసీలను బలిపెట్టడం సరికాదంటున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు పోటీచేసేందుకు అందివచ్చిన అవకాశాన్ని కాలరాయకూడదని కోరుతున్నారు.
బీజేపీ తీరుపై బీసీ సంఘాల విమర్శ
దీనికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుందనే బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు విమర్శిస్తున్నారు. బీసీలను తమ రాజకీయాలకు పావుగా వాడుకోవద్దని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ముస్లింలలో కొందరు బీసీలుగా లేనట్లు.. ఒక్క తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ వారిని బీసీల్లో చేర్చినట్లు రాజకీయ ప్రయోజన అంశాలను లేవనెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచందర్రావు, లక్ష్మణ్ లు ఈ అంశాన్ని పదేపదే మాట్లాడడం పట్ల బీసీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీలోని ప్రధాన బీసీ నాయకుల తీరుపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ ధర్నాను బీజేపీ నాయకులు ఆహ్వానించకపోయినప్పటికీ బీసీల అంశాన్ని పక్కదారిపట్టించే విధంగా మాట్లాడడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ధర్నా పై బీఆర్ఎస్ విమర్శలు
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాకు కనీస మద్ధతూ తెలియజేయలేదు. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహూల్ గాంధీ హాజరుకాకపోవడం పట్ల విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అంటూ పేర్కొనడం గమనార్హం. బీఆర్ఎస్ లోని బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, తలసాని కాంగ్రెస్ ధర్నా పైన విమర్శలు చేస్తున్నారు. పైగా 14న కరీంనగర్లో బీసీల గురించి సభ నిర్వహిస్తామని ప్రకటించారు. బీసీల గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ బీసీ నాయకత్వం మండిపడుతోంది. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాని ప్రతిపక్షనాయకుడు కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. జరుగనున్న బీఆర్ఎస్ సభను ప్రత్యర్ధులు అట్టర్ ప్లాప్ అనలా? అంటూ బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని పరిశీలించకుండా, బీసీల అంశంపై చర్చ జరుగకుండా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. బీసీల గురించి అనేక మాటలు మాట్లాడే మూడు పార్టీలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీసీలు కోరుతున్నారు.