Site icon vidhaatha

High Court : 9 లక్షల మంది రైతులకు మేలు చేసిన హైకోర్టు

High Court

హైకోర్టు తీర్పుతో…
సాదాబైనామాలకు శాశ్వత హక్కులు
– 9 లక్షల మంది రైతులకు మేలు
– 10 లక్షల ఎకరాలకు 13-బి ప్రాసీడింగ్‌లు
– తెలంగాణ వ్యాప్తంగా తగ్గనున్న భూ వివాదాల

– తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ప్రకటన

హైదరాబాద్, ఆగస్టు26(విధాత): సాదాబైనా పెండింగ్ దరఖాస్తుల కేసులో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సాదాబైనామాలకు శాశ్వత హక్కులు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. హైకోర్టు చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రంలో సుమారు 9 లక్షల 894 మంది రైతులకు మేలు జరగడంతో పాటు సుమారు 10 లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్ జారీ అవుతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ సంపూర్ణం అయితే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నోటి మాట, తెల్లకాగితాలు, బాండ్ పేప‌ర్లపై ఒప్పందాల‌తో భూములపై క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌డం గతంలో స‌ర్వ‌సాధార‌ణం. ఇలా కొనుగోలు చేసిన భూముల‌ను తదనంతరం రిజిస్ట్రేష‌న్, మ్యూటేష‌న్‌ చేయించుకోన‌ట్లైతే ఆ భూముల‌ను సాదాబైనామాలు అంటారు. సాదాబైనామ ప‌త్రాలున్న రైతులంద‌రికీ 13-బి ప్రొసీడింగ్‌ల‌ను జారీ చేసి ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను అందిస్తామ‌ని ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగానే 2014 జూన్ 2 కంటే ముందు తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరణలో భాగంగా అర్హులైన రైతుల నుంచి (పట్టణాల్లో అవకాశం లేదు) దరఖాస్తులను స్వీకరించారు.

మొద‌టి విడ‌త‌లో సుమారు 12,64,000 మంది రైతుల నుంచి మీ సేవ కేంద్రాల‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పానుపుస్తకం చట్టం-1971 ప్రకారం ఆర్హులైన రైతులకు 13-బి ప్రాసీడింగ్‌ల‌ను జారీ చేయడంతో పాటు సుమారు 6ల‌క్ష‌ల మందికి పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అయితే తదనంతరం రైతుల నుంచి వచ్చిన వినతుల మేరకు సాదాబైనామాలకు మరోమారు ఆవకాశం ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం 2021 అక్టోబర్‌ 18వ తేదీన సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అనుమతినిస్తూ జీవో-112ను విడుదల చేసింది. అక్టోబర్‌ 30వ తేదీ వరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 30వ తేదీ వరకు సుమారు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మళ్లీ 2020 నవంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ అక్టోబ‌ర్ 30వ తేదీన అదేశాలు జారీ చేసింది. 2020 అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కేవలం 11 రోజుల వ్యవధిలో సుమారు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని, సాదాబైనామాల రెండవ విడత క్రమబద్ధీకరణకు మొత్తం 9,00,894 లక్షం దరఖాస్తులు వచ్చాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2020 అక్టోబ‌ర్ 30వ తేదీన‌ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన ఆర్ ఓ ఆర్ (రికార్డు ఆఫ్‌ రైట్-2020) చట్టంను అమల్లోకి. తీసుకువచ్చింది. నూతన చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ర‌ద్ద‌యిన‌ ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం సాదాబైనామాల దరఖాస్తులను ఎలా స్వీకరిస్తార‌ని, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. ఈ ఫిల్ పై విచార‌ణ చేసిన హైకోర్టు 2020 అక్టోబర్ 29వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 29వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి 13-బి పత్రాలను జారీ చేయవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్త‌ర్వులిచ్చింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. తాజాగా 2020 అక్టోబర్‌ 30వ తేదీ లోపు స్వీకరించిన 2,26,693 దరఖాస్తులను, అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్ ప్రకారం సాదాబైనామాలను క్రమబద్దీకరించవచ్చని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో సాదాబైనామ రైతులకు ఊరట లభిస్తుందని లచ్చిరెడ్డి తెలిపారు.

Exit mobile version