Site icon vidhaatha

పర్యాటక పెట్టుబడులకు.. తెలంగాణ అనుకూలం: మంత్రి జూపల్లి

విధాత: తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న టూరిజం పాలసీతో దేశంలో ఎక్క‌డ లేని విధంగా పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్ లో జ‌రిగిన‌ ద‌క్షిణాసియా 20వ హోట‌ల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫ‌రెన్స్ లో మంత్రి జూప‌ల్లి పాల్గొన్నారు.

ప్ర‌ఖ్యాత హోట‌ల్స్, ట్రావెల్స్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో మంత్రి జూప‌ల్లి ప్ర‌త్య‌కంగా స‌మావేశ‌మై తెలంగాణ ఆతిధ్య రంగంలో పెట్టుబ‌డులు పెట్టి ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని ఆహ్వానించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

పర్యాటకులకు తొలిగమ్య స్థానం తెలంగాణ

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణ‌ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, హెరిటేజ్, మెడికల్, వెల్ నెస్ టూరిజంను అభివృద్ధి చేసేలా నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందించామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో 2030 నాటికి రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలనే ఆశ‌యంతో ప‌ని చేస్తున్నామ‌ని పేర్కొన్నారు .

Exit mobile version