విధాత, హైదరాబాద్ : తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవుర్ గా మారుస్తూ సోమవారం రాత్రి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఏమైందో ఏమోగాని తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుపై కనిపించకుండా స్టిక్కర్ వేసి మూసేశారు. ఈ ఫ్లై ఓవర్ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా! అలా ఎందుకు పేరు కనిపించకుండా స్టిక్కర్ వేశారన్నదానిపై పొలిటికల్ సర్కిల్ లో..నగర వాసుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.
ఎవరి ఆదేశాలతో తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డు కనిపించకుండా చేశారన్న చర్చలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే చంద్రబాబు ఆదేశాల మేరకే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుపై వెనక్కి తగ్గారంటూ ఎటాక్ చేస్తుంది. అసలు అలా ఎందుకు చేశారన్నది ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిస్తేగాని దీనిపై చెలరేగిన గందరగోళం సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. 2005 జనవరి 22న, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఆయనే దీనికి ‘తెలుగు తల్లి ఫ్లైఓవర్’ అనే పేరు పెట్టారు. ఇన్నాళ్లు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేరు మార్పు జరుగడం ఈ సందర్భంగా గమనార్హం.