Gajawada Swaroopa | ఇప్పుడంతా కల్తీ విత్తనాలు( Fake Seeds ) యధేచ్ఛగా రాజ్యమేలుతున్నాయి. ఆయా కంపెనీలు కల్తీ విత్తనాలను విక్రయిస్తూ రైతులను( Farmers ) నిలువునా మోసం చేస్తున్నారు. పంట దిగుబడి రాకపోవడం ఒక ఎత్తు అయితే.. ఆ కల్తీ విత్తనాలతో పండించిన కూరగాయలను( Vegetables ) అనారోగ్యాల పాలవడం మరో ఎత్తు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఓ మహిళా రైతు( Woman Farmer ) మాత్రం.. దేశీ విత్తనాల( Native Seeds ) సేకరణలో ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది. ఈ విత్తనాలను ప్రతి ఏడాది విత్తడం.. పంట దిగుబడి సాధించడంతో పాటు ఆరోగ్యకరమైన కూరగాయలను అందించేందుకు తోడ్పాటును అందిస్తుంది. మరి ఆ మహిళా రైతు ఎవరు..? దేశీ విత్తనాలను సేకరిస్తూ తెలంగాణ విత్తన భాండాగారంగా( Telangana Seed Bank ) మారిన ఆవిడ గురించి తెలుసుకోవాలంటే రాజన్న సిరిసిల్ల( Rajanna Siricilla ) జిల్లాకు వెళ్లాల్సిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గజవాడ స్వరూప( Gajawada Swaroopa ) బాల్యంలో తన తల్లి ఇంటి పెరట్లో అనేక రకాల కూరగాయలను పండించేది. మెంతులు( Fenugreek ), పాలకూర నుంచి మొదలుకుంటే మిర్చి, ఉల్లిగడ్డల( Onions ) వరకు అన్ని రకాల కూరగాయలు సాగు చేసేది. వీటిలో కొన్ని కూరగాయలను ఎండబెట్టి వాటి నుంచి విత్తనాలను సేకరించేది. మళ్లీ ఆ విత్తనాలను వచ్చే ఏడాదిలో సాగుకు తన తల్లి వినియోగించేదిని గజవాడ స్వరూప తెలిపింది. ఆ ప్రభావం తన మీద కూడా పడింది. దాంతో తాను కూడా దేశీ విత్తనాలను సేకరించడం, వాటిని భద్రపరచడం ప్రారంభించాను. అలా ఇప్పటి వరకు 650 రకాల దేశీ విత్తనాలను సేకరించాను అని జగవాడ స్వరూప పేర్కొంది.
దేశీ విత్తనాలను సేకరిస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తూ..
ఈ విత్తనాల సేకరణలో భాగంగా.. స్వరూప తాను ఉంటున్న గ్రామంలోని సమీప ఊర్లకు, తండాలకు వెళ్లేది. అక్కడ ఉన్న పలు కూరగాయల నుంచి విత్తనాలు సేకరించేది.. సేకరిస్తూనే ఉంది. కేవలం దేశీ విత్తనాలను సేకరించి, వాటిపై రైతులకు అవగాహన కూడా కల్పిస్తుంది. ఎందుకంటే చాలా మంది రైతులు.. దేశీ విత్తనాలను మరిచిపోయారు. వాటి ప్రాధాన్యతను కూడా పక్కనపెట్టారు. ఈ క్రమంలో దేశీ విత్తనాలను సేకరిస్తూ.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులకు దేశీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు స్వరూప తెలిపింది. భవిష్యత్ తరాలకు ఈ విత్తనాలను పరిచయం చేయాలని, కచ్చితంగా వీటిని సాగు చేస్తూ భద్రపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్వరూప పేర్కొంది.
650 రకాల దేశీ విత్తనాలు సేకరణ..
తాను గత తొమ్మిదేండ్లలో 650 రకాలకు చెందిన దేశీ విత్తనాలను సేకరించాను. ఇందులో 450 రకాల వరకు కూరగాయల విత్తనాలు ఉన్నాయి. మిగతావి పువ్వులు, వరి, తృణ ధాన్యాలకు సంబంధించిన విత్తనాలు ఉన్నట్లు స్వరూప పేర్కొంది. బెండకాయకు సంబంధించి 15 రకాల విత్తనాలు, వంకాయకు సంబంధించి 20 రకాలు, మిర్చికి సంబంధించి 10 రకాలు, పసుపునకు సంబంధించి 8 రకాలు, పొట్లకాయకు సంబంధించి ఐదు రకాలు, టమాటాకు సంబంధించి 15 రకాల విత్తనాలు ఉన్నట్లు గజవాడ స్వరూప తెలిపింది. టమాటా వెరైటీస్ తీసుకుంటే.. ఇందులో కొన్ని చిన్న రకానికి, కొన్ని పెద్ద రకానికి సంబంధించినవి ఉన్నాయి. కొన్ని రకాలకు సంబంధించిన టమాటాలు.. ఒక్కోటి అర కేజీ వరకు ఉంటాయని తెలిపింది.
ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ. 10 నుంచి రూ. 50 వరకు
స్వరూప 1000 గజాల స్థలంలో ఆర్గానిక్ వెజిటబుల్స్, పువ్వులను పెంచుతున్నారు. తన వద్ద ఉన్న దేశీ విత్తనాలను కేవలం హోం గార్డెనర్స్, టెర్రస్‌పై కూరగాయలు పండించే వారికే విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ. 10 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. అవసరం ఉన్న వారు సంప్రదిస్తే ఇండియన్ పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు స్వరూప తెలిపింది. విత్తనాలు పాడవకుండా ఉండేందుకు.. వాటిని గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ జార్‌లలో నిల్వ చేస్తున్నట్లు పేర్కొంది. నిల్వ చేసిన విత్తనాల మధ్య వేప ఆకులు, గుమ్మడికాయ ఆకులను ఉంచడం ద్వారా.. ఆ విత్తనాలు పాడవకుండా ఉంటాయని స్వరూప తెలిపింది.