Group-1 Hall Tickets | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్( Group-1 mains ) పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ( TGPSC ) అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14వ తేదీన మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల( Group-1 Hall Tickets )ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 21వ తేదీ వరకు అంటే తొలి పరీక్ష ప్రారంభం అయ్యే వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఇక పరీక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఏడు పరీక్షలకు ఒకే హాల్ టికెట్‌ను తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. ప్రతి పరీక్షా గదిలో గోడ గడియారాలు( Wall Clocks ) అందుబాటులో ఉంచుతామని, ఎవరూ కూడా గడియారాలు తెచ్చుకోవద్దని సూచించారు.