TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని టీజీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని నాగిరెడ్డి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్యం ప్రధాన ధ్యేయమని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఉండాలని కోరారు.
ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సీనియర్ అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీ నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఈ చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించడం ఎంతో అవసరమని అన్నారు. శుక్రవారం జరిగే చర్చల ఫలితాలు ఉద్యోగులు అందరికీ మేలు చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎటువంటి ఆందోళనలకు లోనుకాకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు.
Read More:
తెలంగాణ ఆర్డీసీ కార్మికుల సమ్మెలో రగిలిన నిప్పు! 36 గంటల్లోనే కీలక మలుపు
ఆర్టీసీ సమ్మె విషయంలో నాడు కేసీఆర్… నేడు రేవంత్ సేమ్ టూ సేమ్?
