ఆర్టీసీ సమ్మె విషయంలో నాడు కేసీఆర్‌… నేడు రేవంత్‌ సేమ్ టూ సేమ్?

అధికారంలో ఉంటే ఒక తరహా.. ప్రతిపక్షంలో ఉంటే మరో తరహా! ఆర్టీసీ సమ్మె విషయలో పాలక పక్షాల అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మెను సమర్థించిన రేవంత్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక.. సమ్మెను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సమ్మెను దుర్మార్గంగా అణచివేసి.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే సమ్మెను సమర్థిస్తూ హరీశ్‌రావు వ్యాఖ్యలు చేయడం.. అంతా ఒక్కటే అనే విషయాన్ని రుజువు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RTC strike KCR Revanth reddy governments stance

విధాత‌, హైద‌రాబాద్‌:

అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా.. ఆర్టీసి కార్మికుల విష‌యంలో వ్యవహరించే తీరు మాత్రం ఒకేటా ఉంటున్నదని గత పరిణామాలు.. ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. కీలక డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కార్మికుల డిమాండ్లకు ప్రతిప‌క్షంలో ఉండ‌గా మ‌ద్దతు తెలిపిన నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చి ముఖ్యమంత్రుగా బాధ్యత‌లు తీసుకున్న త‌రువాత విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకే ప్రయత్నిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ద‌శాబ్దాల‌ కాలంగా ఇదే చ‌రిత్ర పున‌రావృతం అవుతున్నదని వారు గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల‌కే కాదు… ఉద్యోగులు, ఇత‌ర కార్మిక వ‌ర్గాల విష‌యంలో కూడా ఇదే విధంగా జ‌రుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఆర్టీసీ కార్మికులు ఆశ్వథ్థామరెడ్డి నాయ‌క‌త్వంలో జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఉద్యమకారుల‌కు అండగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం స‌క్సెస్‌లో, ముఖ్యంగా స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌క్సెస్‌లో ఆర్టీసీ కార్మికులు అగ్రభాగాన నిలిచారని చరిత్ర చెబుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తార‌ని అప్పట్లో కార్మికులు నమ్మారు. ప్రత్యేక‌ రాష్ట్రంలో ఆర్టీసీని బ‌లోపేతం చేస్తామ‌ని, ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని బీఆరెస్ అధినేత‌గా, ఉద్యమ నాయ‌కుడిగా కేసీఆర్ ప్రక‌టించారు. కానీ.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ వేరుగా ఉన్నది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా.. వెంట‌నే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని కార్మికులు డిమాండ్ చేయ‌లేదు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌నే డిమాండ్‌ ముందుకు వచ్చింది. అప్పటికే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికుల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో అల‌జ‌డి మొద‌లై… ప్రభుత్వం వ‌ద్ద ఈ డిమాండ్‌ను పెట్టారు.

అయితే.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ను ప‌క్కన పెట్టిన నాటి కేసీఆర్ స‌ర్కారు… ఏకంగా ఆర్టీసీలో యూనియ‌న్లను ర‌ద్దు చేసింది. నాడు ఆర్టీసీ కార్మికులు 2019 అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి 52 రోజుల పాటు సుదీర్ఘకాలం స‌మ్మె చేశారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సమ్మెను విఫలం చేసేందుకు నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్నట్టుగానే.. అప్పట్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా వ్యవహరించింది. స‌మ్మెకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్మికుల‌తో బ‌స్సులు న‌డిపించే ప్రయ‌త్నం చేసింది. ఆ త‌రువాత ఏవో కొన్ని డిమాండ్లు ప‌రిష్కరించిన ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో మాత్రం విలీనం చేయ‌లేదు. చివ‌ర‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారేగానీ.. అది ఆచరణకు నోచుకోలేదు.

అప్పటి కాంగ్రెస్ నాయ‌కుడిగా, మ‌ల్కాజిగిరి ఎంపీగా ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేసిన స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్దతు ప‌లికారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు ఇవ్వాల‌ని, భ‌ద్రత‌, ప్రయోజ‌నాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మొత్తం ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నదంటూ ఈ సమ్మెకు అన్ని సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అంశాన్ని నొక్కి చెప్పారు.

సీన్ క‌ట్ చేస్తే… 2024 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికుల విషయంలో నాడు కేసీఆర్‌ తీరులోనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో బీఆరెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మెను తీవ్రంగా అణచివేసిన సంగతిని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఒక దశలో డ్యూటీకి హాజరుకానివారు సెల్ఫ్‌ డిస్మిస్డ్‌ అంటూ నాటి సీఎం కేసీఆర్‌ బెదిరించారు. సమ్మెకు వ్యతిరేకంగా ఒక పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలు, కథనాలు వండించారు. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెను విరమించాల్సి వచ్చింది. ఒక విధంగా హక్కుతో సమ్మెకు దిగిన కార్మికులను కాళ్లబేరానికి రప్పించుకున్న చరిత్ర ఆనాటిది. ఇప్పుడు ఆ విషయాలేవీ గుర్తులేవన్నట్టు మాట్లాడిన హరీశ్‌రావు.. తక్షణమే చర్చలు జరిపి ఆర్మీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేయడం కొసమెరుపు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎన్నికల దాకా ఆగిన విషయాన్ని కూడా ఆయన చెప్పటం లేదు.

ప్రధాన పార్టీలైన అధికార, ప్రతిప‌క్షాలు త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం మాత్రమే కార్మికుల ప‌క్షం వ‌హిస్తున్నట్లు స్టేట్ మెంట్లు ఇస్తార‌ని, వారి అస‌లు ఉద్దేశం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌నే అర్థం అవుతుంద‌ని ఒక కార్మికుడు అన్నారు. ఏ పార్టీ నాయ‌కుడికైనా త‌మ రాజ‌కీయ ప్రయోజ‌నాలే కానీ, మా కార్మికుల ప్రయోజ‌లు ప‌ట్టవ‌ని మ‌రో కార్మికుడు ఆవేద‌న వ్యక్తం చేశాడు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని ప్రతిప‌క్షంలో డిమాండ్‌ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన త‌రువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాడు స్వయంగా మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సిద్ధపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా… ఆర్టీసీని ప్రైవేట్ బాట‌లో న‌డిపిస్తున్నార‌న్న విమ‌ర్శలు బ‌లంగా ఉన్నాయి. ఏదైనా కార్మికుల ప్రధాన డిమాండ్‌ను రేవంత్ రెడ్డి స‌ర్కారు నెర‌వేర్చకపోవ‌డంతోనే స‌మ్మెకు దిగాల్సి వ‌చ్చింద‌ని కార్మిక సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

ఆర్టీసీ కార్మికుల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె, కార్మికుల డమాండ్ల‌పై మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుడు ఆత్మ‌హ‌త్య ప్ర‌త‌య్నం చేసిన‌ సంఘట‌న‌పై కూడా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని ..కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి తో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Monalisa | వైరల్ బ్యూటీ మోనాలిసా కేసు కొత్త మలుపు… గర్భవతి వార్తల‌తో మళ్లీ హాట్ టాపిక్!
Credit Card Closure | కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. రూ.3.21లక్షల పరిహారంతో సెటిల్‌మెంట్!
పొంచి ఉన్న పాముల మధ్య కుందేలు జీవన పోరాటం.. 5 నిమిషాల వీడియో వైరల్‌.. చివరిలో ట్విస్ట్‌..
కింగ్‌ కోబ్రాలు నాలుగు జాతులా? మెడికల్‌ పజిల్‌కు పరిష్కారం దొరికిందా?

Latest News