Praneeth Rao DSP demotion| ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ .. ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు పొందిన డీఎస్పీ పదోన్నతిని రద్దు చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

Praneeth Rao DSP demotion| ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ .. ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు పొందిన డీఎస్పీ  పదోన్నతిని రద్దు చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత ప్రొబేషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రణీత్ రావు ఇకపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాక విధుల నుంచి సస్పెండ్ చేశారు. యాక్సిలరేటెడ్‌  ప్రమోషన్ పొందిన డీఎస్పీని మొదటి సారి ఇన్స్పెక్టర్ గా డిమోట్ చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకోవడం విశేషం.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2024మార్చి 10న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీప్ టి.ప్రభాకర్ రావు ఆదేశాల నేపథ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావు బృందం అప్పటి అధికార పార్టీకి రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం కల్గించేలా వేల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలు నమోదు అయ్యాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు జడ్జీలు, జర్నలిస్టులు, సినీ సెలబ్రెటీలు, వ్యాపారుల ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ విచారణలో గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే ఎస్ఐబీలోని ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో పాటు విలువైన సమాచారంతో కూడిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను, పెన్ డ్రైవ్ లను, ల్యాప్ టాప్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేసి మూసీ నదిలో పడవేశారు.

సిట్ విచారణతో వెలుగులోకి అక్రమ ఫోన్ ట్యాపింగ్

సిట్ విచారణలో భాగంగా ధ్వంసమైన డేటాను గుర్తించి..కొంతవరకు డేటాను రికవరీ చేయగలిగింది. అలాగే ప్రణీత్ రావు సెల్ ఫోన్ నుంచి  ట్యాపింగ్ ఫోన్ల సమాచారాన్ని గుర్తించింది. ట్యాపింగ్ కేసు పురోగతిలో ఈ సమాచారం కీలకంగా మారింది.   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4వేలకు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి.  2023 నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని… మావోయిస్టుల సమాచారం సేకరణ ముసుగులో రివ్యూ కమిటీకి ప్రతిపక్ష రాజకీయ నేతల నెంబర్లను పంపించి అక్రమ అనుమతులు పొంది అక్రమ ఫోన్‌ ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది.