TGSRTC India’s First Public Transport To Use AI | దేశంలోనే తొలిసారి..తెలంగాణ ఆర్టీసీలో ఏఐ వినియోగం

తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే ప్రజారవాణ సంస్థల్లో ఏఐ వినియోగం మొదలుపెట్టింది, సిబ్బంది, షెడ్యూల్, ఖర్చులు సులభతరం.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) దేశంలోనే ప్రజారవాణ సంస్థలో ఏఐ వినియోగిస్తున్న సంస్థగా తెలంగాణ ఆర్టీసీ నిలిచింది. హ‌న్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ ఏఐ వాడకంలో టీజీఎస్ ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తుంది. సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్య‌వేక్షణ‌, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆర్టీసీలో ఏఐ వినియోగిస్తున్నారు. ప్రతినెల స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ (ఎస్డీపీ) సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి అమలులో ముందుకెలుతున్నారు.

ఏఐ వినియోగం కోసం స్పెషల్ టీమ్

టీజీఎస్ ఆర్టీసీలో ఏఐ వినియోగం కోసం యాజమాన్యం ఓ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారుల‌ను గుర్తించి టీమ్ లోకి ఎంపిక చేశారు. వారికి ఏఐ వాడ‌కంపై హన్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ శిక్ష‌ణ అందిస్తుంది. ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొద‌ట‌గా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారని.. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఆరోగ్య ప‌రిస్థితిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమ‌లు చేయ‌గా.. మంచి ఫ‌లితాలు రావడంతో క్రమంగా అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్ చేస్తోందని..అలాగే రోజు, తిథి, పండుగులు, వారాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో ప్ర‌యాణికుల ర‌ద్దీని అంచ‌నా వేసి.. ఆ మేర‌కు బ‌స్సుల‌ను సంస్థ ఏర్పాటు చేయ‌నున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.

టీజీఎస్ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్ట్ అమ‌లు తీరు గురించి హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాల‌యంలో  ఇటీవ‌ల ర‌వాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాధబాబు, సునీల్ రేగుళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.