బాన్సువాడ కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు.. అసమ్మతి వర్గం నిరసన ర్యాలీ

  • Publish Date - November 9, 2023 / 11:52 AM IST
  • స్థానికేతరులకు అభ్యర్థిత్వమా?


విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఆపార్టీ నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో ఆశావహులు రగిలిపోయారు. స్థానికేతరుడైన రవీందర్ కు టికెట్ ఎలా ఇస్తారంటూ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ అసంతృప్తులంతా ఏనుగు రవీందర్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తడ్కోల్ చౌరస్తా నుండి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది.


అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం బీసీలపై చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో కాసుల బాలరాజ్ 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచారని అన్నారు. ఈ క్రమంలో అధిష్టానం సీనియర్లు, స్థానికులైన నాయకులను టికెట్ కేటాయింపులో గుర్తించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని స్థానికులకే టికెట్ కేటాయించాలని కాసుల బాలరాజ్ పోరాటంలో చేస్తున్నారన్నారు.


అందులో భాగంగానే బుధవారం కాసుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గంలోని 16 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. వారిలో ఎవ్వరికి అధిష్టానం టికెట్టు ఇచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖలెక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.