Site icon vidhaatha

DSC Exam | యథాతథంగా డీఎస్సీ పరీక్షలు.. వాయిదాకు ఒప్పుకోని సర్కారు

DSC Exam : ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని పేర్కొంది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. కాగా డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. టెట్‌ పరీక్ష నిర్వహించిన 25 రోజులకే డీఎస్సీ నిర్వహిస్తున్నారని, రెండు పరీక్షల సిలబస్‌ వేర్వేరు కాబట్టి డీఎస్సీ ప్రిపరేషన్‌కు మరికొంత సమయం అవసరమని వారు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టిడించారు.

అయితే అభ్యర్థుల అందోళనను తెలంగాణ ప్రభుత్వం లెక్కచేయలేదు. డీఎస్సీ పరీక్షల వాయిదాకు ససేమిరా అంది. యథాతథంగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దాంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు అర్థం లేకుండా పోయింది.

Exit mobile version