Site icon vidhaatha

MLC Kavitha | కవిత విడుదలకు కొనసాగుతున్న ప్రక్రియ.. రిలీజ్‌ వారెంట్‌ ఇచ్చిన ట్రయల్‌ కోర్టు

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడుదల చేయనున్నారు. కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇప్పటికే ట్రయల్‌ కోర్టు కవిత విడుదల కోసం రిలీజ్‌ వారెంట్‌ జారీచేసింది. విడుదల ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నది. అంటే ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు.

మొత్తానికి దాదాపు 165 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇవాళ కవితకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇవాళ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బ‌స చేయ‌నున్నారు. రేపు ట్రయల్‌ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మ‌ధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

రేపు క‌విత వెంట ఆమె భ‌ర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు రానున్నారు. మరోవైపు బుధవారం ఉద‌యం బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవ‌కాశం ఉంది. కాగా క‌విత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్‌ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్‌ షీట్‌ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది.

అంతేగాక సెక్షన్‌ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్‌ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ఢిల్లీ హైకోర్టు జడ్జి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. సెక్షన్‌ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్‌ నిరాకరించడం సరికాదని నొక్కిచెప్పింది.

Exit mobile version