కేసీఆర్ ప్రలోభాలకు లొంగని సీతక్క
తెలంగాణ ఉద్యమకారుల వేదిక
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: త్యాగాలను అపహాస్యం చేసిన కేసీఆర్ ను ఓడించి తెలంగాణను రక్షించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక పిలుపునిచ్చింది. ఆదివారం ములుగు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వేదిక ఆధ్వర్యంలో కరపత్రం పంచారు. ఈసందర్భంగా గోవిందరావుపేట మండలం పస్రలో నాయకులు సోమ రామమూర్తి, చింతకింది కుమారస్వామి, సాయిని నరేందర్, చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడారు.
రెండు దశాబ్దాల ప్రజల పోరాటం, ప్రాణాలను త్యాగం చేసిన యువకులు, సబ్బండ వర్గాల సహాయ నిరాకరణతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే సీమాంధ్ర దోపిడీని మించిన దోపిడీకి పాల్పడి, తెలంగాణ సమాజాన్ని, నిరుద్యోగులను వంచించారని విమర్శించారు. కేసీఆర్ దుష్ట పాలనను అంతం చేయాలన్నారు. అత్యంత వెనుకబడిన ములుగు నియోజకవర్గంలో వ్యవసాయ రంగాన్ని, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే సీతక్క ప్రతిపక్ష పార్టీకి చెందడం, కేసీఆర్ ప్రలోభాలకు లొంగకుండా, గెలిచిన పార్టీని మోసం చేయకుండా నియోజకవర్గ ప్రజల పక్షాన ధైర్యంగా సీతక్క నిలబడిందని అన్నారు. బలమైన ఆదివాసీ నాయకురాలిని ఓడించాలనే కుట్రతో ప్రాంతేతర ఆధిపత్య వర్గాల నాయకులను డబ్బు సంచులతో దించి అనైతిక రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
నియోజవర్గంలోని ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, విద్యార్థి, యువత, రైతులు, మహిళలు, ప్రజా సంఘాల వారు పార్టీలకతీతంగా సీతక్కను గెలిపించి, భవిష్యత్ లో నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ, నాయకులు చింత క్రాంతి, ఈక జగ్గారావు, రాంబాబు, పులుగుజ్జు వెంకన్న, ఎల్ హెచ్ పీఎస్ నాయకులు రస్పూత్ సీతారాం నాయక్, బూక్యా రాజు పాల్గొన్నారు.