Site icon vidhaatha

కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లు పరిస్థితి ఉంది: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆ ఇంటి మీది కాకిని ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న రేవంత్ .. ఇంటింటికీ తిరిగి కండువాలు కప్పుతున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. లోక్ సభ ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అన్న రేవంత్ మాటకు దిక్కు లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై కాంగ్రెస్ అధిష్ఠానమే కమిటీ వేసిందని పేర్కొన్నారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దు కోలేవని అన్నారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, కానీ.. తెలంగాణను ఆపలేక పోయాడని గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, పదేళ్లు గొప్పగా పాలించిన పార్టీగా నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలం అనుకుంటే పొరపాటన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అసాధ్యమని చెప్పారు. సాధ్యంకాని హామీలు కాబట్టి మీరు విజయవంతం కాలేరని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో రెండు నెలలుగా ఫించన్లు ఇవ్వడం లేదు. రైతుబంధు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లు పరిస్థితి ఉంది. రైతుభరోసా సంగతి దేవుడెరుగు .. రైతుబంధుకే దిక్కు లేదు’ అని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రుణమాఫీకి సంబంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు ఇచ్చామని, ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తారా ? చేయరా ? ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల వివరాలు ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ రూ.2 లక్షల రుణాలు లేవని బ్యాంకు అధికారులే చెబుతున్నారని పేర్కొన్నారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తారా? కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు? వారికి రూ.15 వేలు ఇస్తారా? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తారా? మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఏమయ్యాయి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పుడు రేషన్ కార్డులన్నీ రద్దు చేసి పథకాలను కుదించే ప్రయత్నాల్లో ఉన్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దళితబంధు వంటి మంచి పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ అపహాస్యం చేశాయని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు మీద కాంగ్రెస్ రూ.12 లక్షలు ఇస్తామన్నారని, ఈ ఏడు నెలల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? అని నిలదీశారు. దేశంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మోదీ దెబ్బకు చతికిలబడిందని, చివరిలో రాహుల్ పాదయాత్రతో కొంచెం లేచి నిలబడిందని అన్నారు. దేశ జనాభా రెండుగా చీలిన కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, మోదీ అనుకూల, మోదీ వ్యతిరేక వర్గాలుగా విడిపోవడానికి కారణం కాంగ్రెస్ వైఫల్యం ఉందని అన్నారు. బీజేపీ గెలుపునకు బీఅర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి సిగ్గుండాలని చెప్పారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో బీజేపీకి లీడ్ వచ్చిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కచ్చితంగా పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version