Site icon vidhaatha

ఆర్టీసీ కార్గో హమాలీ కూలి రేట్లు, స్వీపర్ల వేతనాలు పెంచాలి … రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి

విధాత : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ డిపోలలో, కార్గోలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలకు కూలి రేట్లు , స్వీపర్లకు వేతనాలు పెంచాలని తెలంగాణ అల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు. శనివారం నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతన బస్సుల ప్రారంభోత్సవానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆర్టీసీ హమాలీలు, బస్టాండ్ స్వీపర్లు తమ సమస్యలపై వేరువేరుగా ప్రతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఏఎన్ఎల్ పార్సెల్ సర్వీస్ నిర్వహించిన సందర్భంలో ఎగుమతి దిగుమతులకు రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలి కూలి రేట్లు పెంచేవారని తెలిపారు. కార్గో ఏర్పడి నాలుగు సంవత్సరాలవుతున్నా పెంచకపోగా ప్రస్తుతం ఇస్తున్న రేట్లను ఆన్‌లైన్ పేరుతో తగ్గించారని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్గో ప్రైవేట్ వారికి ఇవ్వడంతో కార్మికులను దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే హమాలి కూలి రేట్లు తగ్గింపు ఆలోచన విరమించుకొని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పార్సెల్ కు 15 రూపాయలు చొప్పున పెంచి ఇవ్వాలని కోరారు. బస్టాండ్‌లో గత 12 సంవత్సరాలుగా మహిళలు స్వీపర్లుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ కాంట్రాక్టర్ల దోపిడికి గురవుతున్నారని, వారాంతపు సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ హక్కులు లేకుండా పనిచేస్తున్న మహిళలకు వేతనాలు పెంచాలని వారంతా సెలవులు ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. బస్టాండ్‌లో హమాలీలకు, స్వీపర్ల కు భోజనశాల విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కట్టా శంకరయ్య, కార్యదర్శి కొంక అంజయ్య, కోశాధికారి నీలం నరసింహ మహిళా స్వీపర్లు దనమ్మ,లక్ష్మీ, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version