మిర్యాలగూడ, జూలై 10- విశాఖ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఒక యువతి గాయపడింది. రైలులో ఒక తాగుబోతు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ సంఘటన జరిగినట్టు రైల్వేపోలీసులు తెలిపారు. మంగళవారంనాడు విశాఖ ఎక్స్‌ప్రెస్ మిర్యాలగూడ స్టేషన్ దాటుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు కూడా రైలు నుంచి కిందపడి గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ వేర్వేరు ఆస్పత్రులలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేస్తున్న యువతి శ్రీకాకుళంలోని స్వగ్రామానికి వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. రైలుబోగీ డోరు వద్ద నిలబడిన తాగుబోతు యువకుడు తన భార్య చేతులు కడుక్కుని వస్తున్నప్పుడు అసభ్యంగా తాకారని ఆ తోపులాటలో ఇద్దరూ రైలు నుంచి కిందపడ్డారని యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి ప్రయాణికులు తమకు సమచారం అందించగానే ప్రమాదస్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు.
పోకిరీ చేష్టలతో రైలు నుంచి కిందపడిన యువతి
