విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీ భేషరతు మద్దతు ప్రకటించింది. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, బోసురాజు వెళ్లి కోదండరామ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా బీఆరెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరామ్ పోరాడుతున్న కోదండరామ్ మద్దతు కోరుతు హైకమాండ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లుగా తెలిపారు. తెలంగాణకు పట్టిన సీఎం కేసీఆర్ నిరంకుశ, అవినీతి పాలన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామన్నారు. 40లక్షల నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించే పోరాటంలో భేషరతుగా మద్దతునిచ్చారన్నారు. ఎన్నికలలోనే కాకుండా భవిష్యత్తులో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ భాగస్వామిగా ఉండేలా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ కీలకంగా ఉంటుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుతో కోదండరామ్ ప్రతిపాదించిన ఆరు అంశాల అమలును రెండు పార్టీల సమన్వయ కమిటీ పర్యవేక్షణ చేస్తుందన్నారు. సీట్లు ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని, ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ ప్రయివేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. రిటైర్డ్ అధికారుల కేసీఆర్ ప్రైవేటు సైన్యం టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు హ్యాకర్స్ ను ఉపయోగించి మా ఫోన్ లు హ్యాక్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని, మేం ఫోన్ లో ప్రయివేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని, మమ్మల్ని సంప్రదించిన వారిని బెదిరిస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.
కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యంగ వ్యతిరేక, నిరంకుశ సీఎం కేసీఆర్ పాలన అంతమొందించేందుకు కాంగ్రెస్ పిలుపుకు స్పందించి కలిసి సాగేందుకు టీజేఎస్ అంగీకరించిందన్నారు. టీజేఎస్ తరుపునా ఆరు అంశాలను కాంగ్రెస్ ముందుంచామని, ప్రభుత్వం ఏర్పడ్డాక వాటి అమలుకు చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. రెండు పార్టీల మధ్య ఇందుకు రాష్ట్ర, నియోజకవర్గాల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.