Site icon vidhaatha

Tomato | హైద‌రాబాద్‌లో చుక్క‌లు చూపిస్తున్న టమాటా ధ‌ర‌లు.. కిలో రూ. 100..!

Tomato | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో ట‌మాటా( Tomato ) ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి ట‌మాటా ధ‌ర‌లు త‌గ్గ‌డం లేనే లేదు. సామాన్యుడు కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కిలో ట‌మాటా ధ‌ర రూ. 80 నుంచి 100 దాకా ప‌లుకుతోంది. పెరిగిన ధ‌ర‌ల‌తో ట‌మాటాను కొనుగోలు చేయ‌లేక‌పోతున్నామ‌ని కోనుగోలుదారులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రైతు బ‌జార్ల‌లో( Rythu Bazar ) నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కు అమ్మ‌కుండా, అధిక రేట్ల‌కు ట‌మాటాను విక్ర‌యిస్తున్నారు. ట‌మాటా ధ‌ర‌ను కిలో రూ. 51 నిర్ణ‌యించ‌గా, రూ. 70కి త‌గ్గ‌కుండా విక్ర‌యిస్తున్నారు. అధిక ధ‌ర‌ల‌కు ఎందుకు అమ్ముతున్నార‌ని ప్ర‌శ్నిస్తే.. పుచ్చులు, మ‌చ్చ‌లున్న మెత్త‌టి ట‌మాటాల‌ను తీసుకోవాల‌ని విక్ర‌య‌దారులు కొనుగోలుదారుల‌కు సూచిస్తున్నారు. రైతు బజార్ల‌లో కాకుండా బ‌హిరంగ మార్కెట్‌లో కిలో రూ. 100కు త‌గ్గ‌కుండా ట‌మాట‌ను అమ్ముతున్నారు.

సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి..!

ప్ర‌తి రోజు న‌గ‌రంలోని అన్ని రైతుబజార్ల‌కు 6 వేల క్వింటాళ్ల ట‌మాటాలు వ‌చ్చేవి. తొల‌క‌రి పంట చేతికి అంద‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం 2.5 నుంచి 3 వేల క్వింటాళ్లు మాత్ర‌మే రైతు బ‌జార్ల‌కు వ‌స్తుంది. దీంతో ట‌మాటా ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చి కొండెక్కాయి. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంది. గ‌తంలో న‌గ‌ర శివార్ల‌లోని యాచారం, మంచాల‌, ఇబ్ర‌హీంప‌ట్నం, మ‌హేశ్వ‌రం నుంచి ట‌మాటా అధికంగా వ‌చ్చేది. ఇప్పుడు రావ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ద‌న‌ప‌ల్లి( Madanapally ), రాజ‌స్థాన్( Rajasthan ) నుంచి వ‌చ్చే టమాటా 60 శాతం త‌గ్గిపోయింది. దీంతో ధ‌ర‌లు పెరిగాయ‌ని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version