స్వలాభం కోసమే కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సెంటిమెంట్‌

తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర అనే పదం మీద విషంకక్కుతూ సెంటిమెంట్ రాజేసి వాడుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ను తమ స్వలాభం కోసం వాడుకొని అన్నిటినీ మరిపించిన ఘనులని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు

  • Publish Date - May 31, 2024 / 06:00 PM IST

అందరితో చర్చించాకే తెలంగాణ గేయం.. చిహ్నంపై నిర్ణయం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్

విధాత: తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర అనే పదం మీద విషంకక్కుతూ సెంటిమెంట్ రాజేసి వాడుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ను తమ స్వలాభం కోసం వాడుకొని అన్నిటినీ మరిపించిన ఘనులని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న దిశగా కాంగ్రెస్ గత నాలుగు నెలలుగా అడుగులేస్తుంటే కేసీఆర్ కుటుంబం లేనిపోని సెంటిమెంట్ రాద్ధాంతాలు చేయాలని చూస్తుందన్నారు. తెలంగాణ చిహ్నంలో ఉద్యమకారులు అభిప్రాయం మేరకు అమరవీరుల స్థూపాన్ని పెడితే మీకున్న కడుపు నొప్పి ఎంటి అని ప్రశ్నించారు. అమరవీరుల చిహ్నాంని ఎందుకు పెట్టకూడదు అని అడుగుతున్నామన్నారు.

వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది? నానా యాగీ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ తను ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటించాడని, కాంగ్రెస్ తెస్తున్న మార్పులతో తను మరుగున పడిపోతానని నానా యాగీ చేస్తున్నట్లు మాకు కనిపిస్తుందన్నారు. మేం వెనక్కి తగ్గేది లేదని, కవులు కళాకారులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళ్తామన్నారు. 100 కోట్లు వెచ్చించి ఆ ఆకారంలో ఒక్క అమర వీరుడి పేరు అయిన చెక్కినారా అని ప్రశ్నించారు. ఇక్కడ చాలా మంది అసువులు భాస్తున్నారని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ప్రజలు కోరుకున్న చిహ్నం అందరితో సంప్రదించి, అతి త్వరలో ప్రజల అకాంక్షలకు చిహ్నం గా తీసుకువస్తామన్నారు.

పదేళ్లలో తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేదా

2014 నుండి మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో తెలంగాణ వాదానికి పాతరేసి ఆంధ్రవాళ్లకు వేసిన పెద్దపీటను గుర్తుకు చేసుకోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కోన్నారు. మాకు స్వాములు అంటే సమస్య లేదని, అయితే కేసీఆర్ ఆంధ్రకు చెందిన చినజీయర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టంగా నమస్కారాలు చేసినప్పుడు సెంటిమెంట్ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అందే శ్రీ రాసిన గీతాన్ని ఎందుకు ఆనాడు ఆంధ్ర గాయకుడు రామకృష్ణతో ఎలా పాడించారని, ఒక మంచి సంగీతం సమకూర్చాలని కీరవాణిని సంప్రదీస్తే దానిపై ప్రాంతీయ రాజకీయం ఎందుకని మండిపడ్డారు. కళకి, కళాకారుడికి ప్రాంతాలు ఉండవని, కీరవాణి ఎంపిక మాది కాదు, మా ఆలోచన కాదు అందే శ్రీ ఆలోచన అదని, యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చిన మీరు, అందుకు అర్కిటెక్ట్‌గా ఆంధ్రుడైన ఆనందసాయిని పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.

మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, పుల్లెల గోపిచంద్‌లు తెలంగాణేతరులన్న సంగతి మరిచారా అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర బిర్యానీ అంటే పనికి రాదని అన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు గుర్తుకు రాలేదా అని, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి, ఆంధ్ర సీఎంని పిలిచినప్పుడు సెంటిమెంట్‌ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కీరవాణి విషయంలో ఆస్కార్ గెలిచినప్పుడు మీరిద్దరూ కేసీఆర్ కేటీఆర్ ట్వీట్ చేయలేదా అని, శారద పీఠం భూములు తెలంగాణలో ఇచ్చినపుడు మీకు తెలంగాణ వాదం గుర్తుకు రాలేదా? అని విమర్శించారు.

అసలు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీ నుంచి ఎందుకు తీసేశారని, అందుకే మిమ్మల్ని ప్రజల్ని అధికారం నుంచి తీసేశారని చురకలేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు కేసీఆర్ పాలనలో ఆంధ్ర వారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కవులు కళాకారులు వివిధ పార్టీ లు నుండి సమాచారం క్రోడీకరించిన తర్వాతనే మ్యానిఫెస్టోలో పెట్టినం, దాని ఆధారంగానే ఈ రోజు తెలంగాణ గేయం, చిహ్నంలపై ముందుకెలుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు రేవంత్, భట్టి, ఉత్తమ్ ఆలోచనలు కాదని, ప్రజల నుండి వచ్చిన అకాంక్ష అని, చిహ్నాన్ని అందరితో చర్చించి ఏది మెజారిటీ ప్రజలు కోరుకుంటారో దాన్ని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

Latest News