Site icon vidhaatha

డీఎస్సీ వాయిదాకు.. మెగా డీఎస్సీకి నిరుద్యోగుల డిమాండ్‌

స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి
అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు..తోపులాట

విధాత, హైదరాబాద్‌: డీఎస్సీ రాత‌ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాలని, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తూ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యాన్ని నిరుద్యోగులు ముట్ట‌డించారు. ల‌క్డీకాపూల్‌లోని ఆ కార్యాల‌యం వ‌ద్ద రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు త‌మ‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డీఎస్సీని మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. ఆందోళ‌న‌కు దిగిన డీఎస్సీ అభ్య‌ర్థుల‌ను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. రాజ‌ధానితో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా డీఎస్సీ అభ్య‌ర్థులు నిరసనలు తెలిపారు.

ప్రభుత్వం డీఎస్సీ వాయిదా వేస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఆలైన్ రాతపరీక్షలకు సిద్ధం కావడం డీఎస్సీ అభ్యర్థులకు ఆగ్రహానికి కారణమైంది. శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న మమ్మల్ని పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేయించడం సరికాదని డీఎస్సీ అభ్యర్థులు విమర్శించారు. మ‌రో మూడు నెల‌ల పాటు డీఎస్సీ పోస్టుపోన్ చేసి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలతో చెప్పినట్లుగా 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ వేయడం ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్‌లు నిరుద్యోగుల సమస్యలకు వంతపాడి, అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారంటూ విమర్శలు గుప్పించారు.

Exit mobile version