Bandi Sanjay | బీఆరెస్ పార్టీ (BRS Party)ని గంగలో కలిపినా.. బీజేపీ (BJP)లో కలిపినా ఏం ప్రయోజనమని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్‌లో చేరిపోయారని, త్వరలోనే కాంగ్రెస్‌లోనే బీఆరెస్ విలీనమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మేన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ (The Young Men’s Improvement Society) భవనాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్ జీ (Shyam Ji) నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారభించడం సంతోషంగా ఉందన్నారు.
లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని, కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉండడమే మనుగకు కారణమన్నారు. బీఆరెస్‌లో బీజేపీ విలీనం వార్తలన్ని కాంగ్రెస్, బీఆరెస్‌ల డ్రామాగా కొట్టిపారేశారు. రుణమాఫీ (Runa Mafi) సహా ఆరుగ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విలీనం ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. కేటీఆర్, కేసీఆర్ లను ప్రజలు చీదరించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వారి పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆరెస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్నారు.
Live : Addressing the Media https://t.co/Fa3UW8rSam
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 18, 2024
అవినీతి పార్టీ బీఆరెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆరెస్ విలీనం కావడం ఖాయమన్నారు. బీఆరెస్ విలీనం పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకే బీజేపీలో బీఆరెస్ విలీనం అని ప్రచారం చేస్తున్నారన్నారు. మొదట కాంగ్రెస్ నాయకుడైన కేసీఆర్ (KCR) ఆ పార్టీలోకే పోతారన్నారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు. రుణ మాఫీ పై రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. బ్యాంకుల నుంచి ఎన్‌వోసీలను రైతులకు ప్రభుత్వం ఇప్పించాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదన్నారు.
రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని, 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి .ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి…బడ్జెట్‌లో రూ.26 వేలు కేటాయించి…చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అని నిలదీశారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. బీజేపీ రుణమాఫీ కాని రైతుల పక్షాన కొట్లాడుతుందన్నారు.