మంత్రి పొన్నంతో సహా ముగ్గురు ఎమ్మెల్యేల హాజరు
హాజరుకాని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
నామినేషన్ వేసినా కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్పుకోలేని పరిస్థితి
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ లోకసభ స్థానం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు సోమవారం తన నామినేషన్ పత్రం దాఖలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులతో కలిసి నామినేషన్ పత్రాన్ని ఆయన జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి అందజేశారు. నామినేషన్ దాఖలకు ముందు రాజేందర్ రావు స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వెంటరాగా, డప్పు చప్పుళ్ళు, ఊరేగింపు మధ్య ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎండలను లెక్కచేయకుండా కరీంనగర్ లోకసభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్ , ఆరెపల్లి మోహన్ , కరీంనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభ్యర్థి ఎవరో తేల్చని కాంగ్రెస్
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిజాల రాజేందర్ రావు సోమవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నేటి వరకు తమ అభ్యర్థి ఎవరో తేల్చలేకపోయింది. నేటి వరకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో, కాంగ్రెస్ నేతలు రాజేందర్ రావును అధికారిక అభ్యర్థిగా ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులు, ఆ పార్టీ జెండాలతో ఊరేగింపు జరిపి నామినేషన్ దాఖలు చేసినా, మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడ ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొనకపోవడం విశేషం. అయితే రాజేందర్ రావ్ కాంగ్రెస్ అభ్యర్థిగానే తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
హాజరుకాని అలిగిరెడ్డి…
కరీంనగర్ లోకసభ స్థానాన్ని ఆశిస్తున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సోమవారం నాటి రాజేందర్ రావ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. రెండు రోజుల క్రితం హుస్నాబాద్ కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. నామినేషన్ల దాఖలకు మరో మూడు రోజుల గడువు ఉండడం, నేటికీ ఏఐసీసీ కరీంనగర్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయకపోవడంతో ప్రవీణ్ రెడ్డి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. టికెట్ వ్యవహారంపై, రాజకీయ మార్పుపై ఇప్పటికిప్పుడు స్పందించడానికి ఆయన నిరాకరించారు.
అసలేం జరుగుతోంది…
లోకసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి స్వయంగా హాజరవుతున్నారు. వారికి మద్దతుగా ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలలో పాల్గొంటూ, పోటీలో ఉన్న అభ్యర్థులకు నైతిక మద్దతు అందించడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పంపుతున్నారు.
వాస్తవానికి ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లోకసభ స్థానం ఎంతో కీలకమైంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఈ స్థానం నుండి పార్టీ అభ్యర్థినే ఇప్పటివరకు ఎంపిక చేయకపోవడం ఆసక్తికరమైన పరిణామం కాగా, అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. మంత్రి పొన్నం, ముఖ్యమంత్రి రేవంత్ మధ్య పొత్తు పోసగడం లేదా? అనే మీ మాంసను రేకెత్తిస్తోంది.
రేవంత్ సూచనను కాదన్నందుకేనా..?
వాస్తవానికి కరీంనగర్ లోకసభ స్థానం నుండి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వం వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు మాత్రమే ఏఐసీసీ ప్రతిపాదనకు వెళ్లేలా, రాష్ట్ర పార్టీ నేతలకు సూచన చేశారు. తనకోసం సీటు త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వానికి పొన్నం మద్దతుగా నిలుస్తారని భావించారు. అయితే జిల్లా మంత్రి అనూహ్యంగా చక్రం తిప్పారు. పార్లమెంట్ పరిధిలోని మరో ముగ్గురు శాసనసభ్యుల మద్దతు కూడగట్టి వెలిచాల రాజేందర్ రావ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రికి మధ్య సయోధ్య దెబ్బతిన్నదనే ప్రచారం సాగుతోంది.
ఏఐసిసి నిర్ణయం..
అయితే ఏఐసిసి నిర్ణయమే శిరోధార్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. పార్టీ కరీంనగర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా, గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికీ అభ్యర్థి ఖరారు కానీ పరిస్థితుల్లో పొన్నం ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఏడు నియోజకవర్గాల పరిధిలో సమావేశాల నిర్వహణ పూర్తి చేశారు. ఆ సమావేశాలకు తన వెంట వెలిచాల రాజేందర్ రావును వెంట తీసుకువెళ్లారు.
కాగా.. సోమవారం నాటి నామినేషన్ కార్యక్రమానికి ఆయనే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కనిపించలేదు. ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడం, అభ్యర్థి ఎంపిక నేటికీ తెమలక పోవడం, దీంతో లోక సభ ఎన్నికల్లో తమ పాత్ర ఏమిటో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.