- సెలక్షన్ కమిటీ జాబితాలో అనర్హులు?
- కీలకస్థాయిల్లో జోరుగా పైరవీ యత్నాలు
- గత తరహాలో పైరవీకారులకే ఇస్తారా?
- పనిచేసే అధికారులను ఎంచుకుంటారా?
- విద్యుత్ సౌధ సిబ్బందిలో చర్చలు
హైదరాబాద్, మే 19 (విధాత)
Viduth Soudha | టీజీ ట్రాన్స్‌కో లో 3 డైరెక్టర్ పోస్టులు, టీజీ జెన్కో లో 5 పోస్టులు, టీజీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో 4, టీజీ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో 4 డైరెక్టర్ పోస్టులకు ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు ఇటీవలే సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి, వడపోత పూర్తి చేసింది. మొత్తం 16 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను సిఫారసు చేసింది. అయితే ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. పోస్టుల కోసం విపరీతమై పోటీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి పైరవీకారులకు పెద్ద పీట వేస్తారా? సమర్థులు, సంస్థకు పేరుతో పాటు ఆదాయం తెచ్చేవారికి ప్రాముఖ్యం ఇస్తారా? అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న శివాజీ అనే అధికారిని టీజీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో ఐటీ జీఎంగా నియమించారు. ఐటీ విభాగాన్ని పటిష్టం చేసే పేరుతో వందల మంది అనుభవం లేని నిపుణులను నియమించుకుంటున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హైదరాబాద్‌లో స్కాడా సిస్టమ్ నత్తకు నడక నేర్పే విధంగా పనిచేస్తున్నదని అంటున్నారు. ఐటీ విభాగంలో కోట్ల రూపాయల్లో అక్రమాలు జరిగాయని, సంస్థ యాజమాన్యం పూర్తి మద్ధతు ఉందనే వాదన కూడా ఉంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎలాంటి అనుభవం లేని ఈయన.. రెండు డిస్కం కంపెనీల్లో డైరెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారంటున్నారు. ప్రభుత్వంలోని పెద్ద మనిషి సహకారంతో డైరెక్టర్ పోస్టును దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ పలుకుబడి..
వాస్తవానికి డైరెక్టర్ పోస్టు కోసం సీజీఎం క్యాడర్ లో పనిచేసి, అనుభవం ఉన్నవారినే ఎంపిక చేయాలని నిబంధన పెట్టుకున్నారు. రాజకీయ పలుకుబడితో ఇద్దరు జనరల్ మేనేజర్లు, నలుగురు సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఇంటర్వ్యూ చేశారని విస్తృత ప్రచారం జరుగుతున్నది. రిజర్వేషన్ కోటాలో ఒక ఇంజినీర్ కూడా ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి సోదరుడి ద్వారా ప్రయత్నం ముమ్మరం చేశారని తెలుస్తున్నది. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకుని నియామకాలు త్వరితగతిన పూర్తి చేయించాలని, సంస్థలను గాడిలో పెట్టాలని విద్యుత్ సంస్థల ఉద్యోగులు కోరుతున్నారు. విద్యుత్ సంస్థల్లో కొనుగోళ్ల గోల్ మాల్, డైరెక్టర్ల నియామకంలో తాత్సారంపై ఇటీవల విధాత సమగ్ర కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.