విధాత : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా ప్రతివాదులు కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడంతో కేసును జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం జూలై చివరి వారానికి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆరెస్ మాజీ మంత్రులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు.
గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది. కాగా, విచారణ సందర్భంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కు మాత్రమే ఎందుకు మార్చాలని పిటిషనర్ల తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉండటంతో కేసు బదిలీ కోరుతున్నామని జగదీశ్‌రెడ్డి తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే కౌంటర్ తప్పకుండా వేయాలని తాముమ ఆదేశించలేమని స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాలు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు నాయుడిని కూడా నిందితునిగా చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.