విధాత: వ్యాప్కోస్ నివేదికను పక్కన పెట్టి అన్నారం, సుందిళ్ల బరాజ్ స్థానాన్ని మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదించారని ఘోష్ కమిషన్ నివేదికలో తెలిపింది. పీసీఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ప్రతిపాదనకు హైపవర్ కమిటీ సభ్యుల్లో ఒకరైన అప్పటి ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు 2016 అక్టోబర్ 22న ఆమోదం తెలిపారని కమిషన్ వివరించింది. దీన్ని పరిశీలిస్తే ఇష్టానుసారం వ్యాప్కోస్ నివేదికను పక్కన పెట్టవచ్చని అర్ధం చేసుకోవచ్చని కమిషన్ అభిప్రాయపడింది.
కేఐపీసీఎల్ లో సభ్యుడిగా ఉన్న ఐఎఎస్ అధికారి ఎస్ కే జోషీ దీనిపై మౌనంగా ఉన్నారని కమిషన్ తెలిపింది. 2017 మార్చి నాటికి బరాజ్ నిర్మాణాలకు సంబంధించి భూమిని ఇవ్వలేదు, 2017 డిసెంబర్, 2018 జనవరి వరకు బరాజ్ నిర్మాణానికి సంబంధించి భూమి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకొనేందుకు పరీక్షలు నిర్వహించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణంతో పాటు లోపాలకు కూడా కాంట్రాక్టు ఏజెన్సీలదే బాధ్యతని, బరాజ్ లలో లోపాలు, మరమ్మత్తుల గురించి కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోలేదని పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది.