Warangal | వరంగల్ ఓటరు తీర్పెటు?.. తీర్పు నిక్షిప్తం చేసిన ఓటరు

భిన్నమైన తీర్పునిచ్చే వరంగల్,ఖమ్మం, మానుకోట ఓటరు ఈ ఎన్నికల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటారా? సాధారణ తీర్పుతో సరిపెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది

  • Publish Date - May 14, 2024 / 07:07 AM IST

మానుకోట పీఠమెవరిదీ?
ఖమ్మంమెట్టెక్కేదెవరు?

విధాత ప్రత్యేక ప్రతినిధి: భిన్నమైన తీర్పునిచ్చే వరంగల్,ఖమ్మం, మానుకోట ఓటరు ఈ ఎన్నికల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటారా? సాధారణ తీర్పుతో సరిపెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో తమ అభిప్రాయాన్ని ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

జూన్ 4వ తేదీన ఫలితాలకంటే ముందుగా ఓటింగ్ సరళినిబట్టి ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు. బీఆరెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో ఈ దఫా ఫలితాలు తారుమారైతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ వనంగల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య, మిగిలిన మానుకోట, ఖమ్మంలో కాంగ్రెస్, బీఆరెస్ మధ్య పోటీ జరిగినట్లు భావిస్తున్నారు.

వరంగల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ

ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ జరిగినప్పటికీ బీఆరెస్ తాను ఉన్నానంటూ పోటీకొచ్చింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆరెస్ నుంచి మారపల్లి సుధీర్ కుమార్ పోటీ చేశారు.ఈ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు, పట్టును పరిశీలిస్తే కాంగ్రెస్, బీఆరెస్ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ ఉండాల్సి ఉండగా తెరపైకి బీజేపీ రావడం చిత్రమైన రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.

ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసంబ్లీ సెగ్మెంట్లు పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, భూపాలపల్లి ఉన్నాయి. ఈ ఏడు స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా పార్లమెంటు ఎన్నికలు వారికి పరీక్షగా మారనున్నాయి. పార్టీకి కూడా అనుకూల పరిస్థితులున్నాయి. ఈ స్థానంలో బీజేపీ బలమైన పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

బీఆరెస్ తన స్థానాన్ని పదిలపరుచుకుంటే ఇక్కడ కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకగా చెప్పవచ్చు. కానీ, బీఆరెస్ తన పట్టు అనుకున్న స్థాయిలో నిలబెట్టుకోకపోవడమే కాకుండా క్రాస్ ఓటింగ్ ప్రభావంతో విజయం పై ప్రభావం కనబరుస్తుందని భావిస్తున్నప్పటికీ బీజేపీతో పోటీపడి కాంగ్రెస్ పట్టునిలబెట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా గత మూడు వరుస ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆరెస్ గెలిచిన విషయం గమనార్హం.

వరంగల్ నియోజకవర్గంలో 64 శాతం

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 64.08 శాతం పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పూర్తి స్థాయి వివరాల తర్వాత ఖచ్చితమైన పోలింగ్ శాతం ప్రకటించనున్నారు. స్టేషన్ ఘన్ పూర్ 74.64శాతం, పాలకుర్తి 68.41 శాతం, పరకాల 70.20 శాతం, వరంగల్ పశ్చిమ 47శాతం, వరంగల్ తూర్పు 59.43 శాతం, వర్ధన్నపేట 66.43శాతం, భూపాలపల్లి 65శాతం పోలింగ్ నమోదైంది.

మానుకోటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్

మానుకోటలో గత రెండు పర్యాయాలు బీఆరెస్ ఈ స్థానాన్ని దక్కించుకున్నది. ఈ సారి ఫలితం మారుతోందంటున్నారు. పోటీ కాంగ్రెస్, బీఆరెస్ మధ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ పాత్ర పెద్దగా లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోరిక బలరామ్ నాయక్, బీఆరెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారామ్ నాయక్ పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆరెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులున్నాయి.

అయితే బీఆరెస్ కూడా తన పట్టునిలబెట్టుకునేందుకు తీవ్రంగా పోటీపడినట్లు చెబుతున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో మహబూబాబాద్,డోర్నకల్, నర్సంపేట, ములుగు, ఇల్లందు, పినపాక,భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నందున పట్టునిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సాయంత్రం 5 గంట వరకు 68.6శాతం పోలింగ్ నమోదైందీ. డోర్నకల్ 70.86%, – మహబూబాబాద్ -67.19%,- నర్సంపేట 73.01%, ములుగు -67.92 %, -పినపాక -65.91%,-ఇల్లందు -69.11%, భద్రాచలం -64.72% పోలింగ్ నమోదైంది.

ఖమ్మంలో కాంగ్రెస్, బీఆరెస్ మధ్య పోటీ

ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం బీఆరెస్ సిట్టింగ్ స్థానం. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామిరెడ్డి, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందిన వారుండగా గత ఎన్నికల్లో బీఆరెస్ పోటీ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఈ సారి ఫలితాలెలా ఉంటాయని చర్చసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఒక్క స్థానం కూడా లేని బీఆరెస్ పార్టీ బలంగానే ఉన్నది. కాంగ్రెస్, బీఆరెఎస్ మధ్య పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులన్నట్లు చెబుతున్నారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.

Latest News