హామీ మేరకు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశాం ,నిరుద్యోగ హామీలపై కట్టుబడి ఉన్నాం … ఎమ్మెల్సీ బల్మూరి స్పష్టీకరణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వెలుతున్నామని, అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు

  • Publish Date - July 1, 2024 / 04:20 PM IST

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వెలుతున్నామని, అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సింగరేణి జెన్క్‌ పరీక్ష, కేంద్ర ప్రభుత్వ పరీక్ష ఒకే రోజు ఉందని చెప్పడంతో జెన్కో పరీక్షను పోస్ట్ పోన్ చేశామన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 30వేలకు పైగా ఉద్యోగ భర్తీ పూర్తి చేశామన్నారు. టెట్ విషయంలో గానీ ఇతర అంశాల్లోగానీ నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది తమ ప్రజా సర్కార్ అని చెప్పారు. డీఎస్సీ అప్లికేషన్‌కు ఫీజు తీసుకోలేదని, పేపర్ లీకేజ్ లేకుండా పరీక్షలు పెడ్తున్నామన్నారు .ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికే మెగా డీఎస్సీ వేశామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందన్నారు. నిరుద్యోగులను రెచ్చగొడుతున్న బీఆరెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 16 పేపర్లు లీక్ జరిగిన సంగతి మరువరాదన్నారు. బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నా.. స్పందించని చరిత్ర బీఆరెస్ పార్టీది అన్నారు. అందరికి ఉద్యోగాలు రావు, హమాలీ పనులు చేసుకోవాలని ఆనాడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనలేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకోలేదా! అని, నిరుద్యోగుల సమస్యలపై ఆందోళన చేయడానికి ధర్నా చౌక్ వద్దకు వెళ్లకుండా అరెస్ట్ చేయలేదా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు పదేళ్లు అగ్గిపెట్ట కూడా దొరకలేదని, హరీష్ రావు అ పదేళ్లు విద్యార్థులను, నిరుద్యోగులను వాడుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పక్షాన మోతిలాల్ నాయక్ ఆమరణ దీక్ష చేస్తున్నాడని, ఆ తమ్ముడి ఆవేదన తెలుసుకొని, సీఎంకు చెప్పడానికే గాంధీ హాస్పిటల్ కు వచ్చామని, ట్విటర్ ఎక్స్‌ వేదికగా చెప్పి మరీ వెళ్లామన్నారు. నిరుద్యోగి ప్రవళిక మరణంపై ముందుగా హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలన్నారు.
మోతిలాల్ నాయక్ కు ఏమీ జరిగినా పూర్తీ బాధ్యత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు లదేనని, ఆ తమ్ముడికి ఏమి జరిగిన సహించేది లేదన్నారు.

Latest News