Jubilee Hills By Poll | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలోని జూబ్లీహిల్స్( Jubilee Hills By Poll ) నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం పెంచడంపై దృష్టి సారించారు. 60 శాతం వరకు ఓట్లు పోలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని చేరుకుంటామనే ఆశాభావాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం పోలింగ్ అనేది గత ఎన్నికల పోలింగ్‌ను పరిశీలిస్తే.. గణనీయమైన పెరుగుదల అని చెప్పొచ్చు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కొత్తగా 2009లో ఏర్పడింది. అప్పట్నుంచి 2009, 2014, 2018, 2023లో సాధారణ ఎన్నికలు జరిగాయి. 2025లో ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 52.76 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023 ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( Maganti Gopinath ) మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈ నియోజకవర్గంలో 2,383 మంది ఓటర్లు పెరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ గతంలో ప్రకటించారు.
నియోజకవర్గం వ్యాప్తంగా 127 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో భాగంగా 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తై పోయిందన్నారు.
