రాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తనాల విక్రయం..
రైతు నష్టపోతే పరిహారం ఇప్పించేదెవరు?
సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతున్నది?
రాష్ట్ర ప్రభుత్వ కొత్త చట్టంలో ఏమున్నది?
సమాధానం భూమి సునీల్ మాటల్లోనే..
Fake Seeds | హైదరాబాద్, జూన్ 24 (విధాత) : భారతదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. 80 శాతం మంది వ్యవసాయం( Agriculture ), దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలోని కోట్లాది మందికి అన్నంపెట్టే అన్నదాత( Farmer ) అనేక ఇబ్బందులను అధిగమిస్తూ వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు( Quality Seeds ) సరఫరా చేయక, నకిలీ విత్తనాలతో( Fake Seeds ) పంట దిగుబడి రాక.. ఒక వేళ పంట చేతికొచ్చినా.. మార్కెట్‌లో మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో.. దిక్కుతోచని దీనస్థితిలో అన్నదాతలు ఆత్మహత్యలకు( Farmers Suicides ) పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాల ఎంపిక, నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట ఎలా వేయాలి? విత్తనాల వల్ల నష్టపోతే పరిహారం వస్తుందా? అన్నదాతల ఆత్మహత్యల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే మేలు జరుగుతుందో.. భూభారతి( Bhu Bharati ) రూపకర్త భూమి సునీల్( Bhumi Sunil ) మాటల్లోనే తెలుసుకుందాం..
ప్రస్తుతం అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, రైతన్నలు కూడా ప్రయివేటు కంపెనీల మాయజాలంలో పడి.. నిలువునా మోసపోతున్నారని భూమి సునీల్ తెలిపారు. ‘రైతు మార్కెట్‌లో విత్తనాలు కొంటున్నాడు. ఆ విత్తనం మొలకెత్తలేదు. ఆశించినంత దిగుబడి రాదు. నష్టం జరిగింది. మరి నష్ట పరిహారం వస్తుందా? అంటే అవుననే అంటున్నారు సునీల్. ‘వాచ్‌లు, సెల్‌ఫోన్లు కొనుగోలు చేశాక పాడైతే.. సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది. విత్తనాలను కొనుగోలు చేసే రైతు కూడా వినియోగదారుడే కదా? రైతులు కూడా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే నష్ట పరిహారం వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. నష్ట పరిహారం కోసం 1966 విత్తన చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ఆ దందా కొనసాగుతూనే ఉందని, రైతు నష్టపోతూనే ఉన్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నష్ట పరిహారం ఇచ్చినా ఎకరానికి రూ. 500, రూ. 1000 ఇస్తున్నారని సునీల్ తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాల్సిందే..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వినియోగదారుల చట్టం కింద రైతు కూడా వినియోగదారుడే అవుతాడని జస్టిస్ సింఘ్వీ తీర్పు ఇచ్చిన విషయాన్ని సునీల్ గుర్తు చేశారు. విత్తనాల్లో లోపం ఉండి నష్టం జరిగితే రైతు వినియోగదారుల ఫోరంకు వెళ్లి దరఖాస్తు పెట్టుకోవచ్చు. పెట్టిన ధరను మాత్రమే చెల్లించడం నష్ట పరిహారం కాదు. ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తుందని విత్తన కంపెనీలు చెప్పాయో.. అంతకు తక్కువ దిగుబడి వస్తే అన్ని క్వింటాళ్లకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఉదాహరణకు ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని విత్తన కంపెనీ చెప్పిందానుకుందాం.. కానీ 2 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిగతా 8 క్వింటాళ్లకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి. దాంతో పాటు సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా కట్టివ్వాలి. రైతుకు కలిగిన మానసిక క్షోభకు కూడా నష్ట పరిహారం చెల్లించాలి అని జస్టిస్ సింఘ్వీ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు 2012లో వచ్చిందని గుర్తు చేస్తూ.. విత్తన కంపెనీలు దీనిని పట్టించుకోవడం లేదని సునీల్ తెలిపారు.
విత్తనాలు కొన్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
విత్తనం కొన్నప్పుడు రైతు తప్పకుండా.. రశీదు తీసుకోవాలి. విత్తనాల డబ్బాను దాచిపెట్టాలి. నష్టం జరిగినప్పుడు వాటిని ల్యాబ్ టెస్ట్‌కు పంపేందుకు కొన్ని గింజలు దాచి పెట్టాలి. నష్టం జరిగిన వెంటనే సదరు విత్తన కంపెనీకి, డీలర్‌కు, వ్యవసాయ అధికారికి సమాచారం ఇచ్చి వినియోగదారుల ఫోరంలో కేసు వేయాలి. దీనిపై రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని సునీల్ చెప్పారు. నష్ట పరిహారం రాలేదంటే మూడు కారణాలు ఉన్నాయి. రైతులకు అవగాహన లేకపోవడం.. విత్తనాల వల్లనే నష్ట పరిహారం జరిగిందని నిరూపించులేకపోవడం, రైతుకు కావాల్సిన న్యాయ సహాయం అందడం పోవడమన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలేవి?
ఇప్పుడు అమలవుతున్న విత్తన చట్టంలో రైతులకు నష్ట పరిహారం ఇప్పించే నిబంధనలే లేవు. నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నియమం లేదు. నాణ్యత లోపం కింద శిక్ష మూడు నెలలు మాత్రమే ఉంది. రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఈ నిబంధనలకు ఎవరూ భయపడడం లేదు. అందుకే ఇటీవల హర్యానా ప్రభుత్వం 1966 విత్తన చట్టాన్ని సవరిస్తూ.. మొదటిసారి తప్పు చేస్తే 5 ఏండ్లు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే పదేండ్లు జైలు శిక్ష, జరిమానా రూ. 25 వేలు విధించేలా చట్ట సవరణ చేసుకున్నారు. ఈ సవరణలతో విత్తన కంపెనీలు ఇప్పుడు ధర్నా చేస్తున్నాయి. వ్యాపారం చేయడం కష్టమవుతుందని విత్తనాలు అమ్మమని బెదిరిస్తున్నారని సునీల్ పేర్కొన్నారు.
తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌పై అన్నదాతలకు అపోహ
ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో విత్తనాలు విక్రయించారు. ప్రస్తుతం 90 శాతం విత్తనాలు ప్రయివేటు మార్కెట్ నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ యూనివర్సిటీలో తయారు చేసిన ఫౌండేషన్ విత్తనాలను గ్రామల్లోకి పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రైతులకు సరిపడినన్ని విత్తనాలు తమ దగ్గర ఉన్నాయని, తమ వద్ద కొనుగోలు చేయాలని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ కోరుతున్నది. ప్రయివేటు కంపెనీలు సరాఫరా చేసే విత్తనాల వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని, సీడ్ కార్పొరేషన్ విత్తనాలు కొంటే దిగుడబడి తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉంది. దీనిపట్ల ప్రభుత్వం అవగాహన కల్పించాలని సునీల్ చెప్పారు. పైగా నష్టం జరిగితే అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త చట్టం.. పీడీ యాక్ట్ తప్పనిసరి
ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాలను తనిఖీలు చేయాలని, బిల్లులతో విక్రయాలు చేసేలా భయం కల్పించాలని సునీల్ చెప్పారు. పీడీ యాక్ట్ సీరియస్‌గా పెట్టాలన్నారు. దాంతో కొంత నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. ‘నకిలీ విత్తనాలు కొనే రైతు మీద కూడా బాధ్యత ఉంది. లేబుల్, రశీదు లేకుండా కొంటే నష్టపోతారన్న విషయం రైతుకు తెలియాలి. విత్తనం రైతు హక్కు. నాణ్యమైన విత్తనం రైతుకు హక్కుగా ఎప్పుడైతే దక్కుతుందో అప్పుడు వ్యవసాయంలో చాలా సమస్యలు తీరిపోతాయి’ అని ఆయన తెలిపారు. ‘1966లో విత్తనాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నోటిఫైడ్ వైరెటీలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. కొత్త చట్టం కోసం 2002 నుంచి ప్రయత్నం జరుగుతూ వస్తుంది. 2002లో కేంద్రం కొత్త విత్తన విధానం తీసుకొచ్చింది. 2004లో కొత్త ముసాయిదా వచ్చింది. ఇది చట్టం కాలేదు. 2010లో మళ్లీ ముసాయిదా వచ్చింది కానీ చట్టం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో 2019లో ఒక ముసాయిదా వచ్చింది. చర్చల్లోనే ఉండిపోయింది కానీ కొత్తచట్టం కాలేదు. 2016లో రాష్ట్రం ప్రయత్నించింది.. కానీ కేంద్రం వద్దని ఆపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల కోసం కొత్త విత్తన చట్టం చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ ఏర్పాటైంది ముసాయిదాకు వెళ్తున్నాం. తప్పు చేసిన విత్తన కంపెనీలపై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం చెబుతున్నది.. సీరియస్ యాక్షన్ ఉంటే.. విత్తన కంపెనీలు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది’ అని సునీల్ వివరించారు.
భూ భారతి మాదిరే విత్తన చట్టం..
‘రైతులకు సంబంధించి రెండు కీలక చట్టాలు ఉన్నాయి. ఒకటి భూమికి సంబంధించిన ఆర్‌వోఆర్ చట్టం, రెండోది విత్తనాలకు సంబంధించిన విత్తన చట్టం. ఈ రెండిటిని సక్రమంగా అమలు చేస్తే రైతుల సమస్యలు 80 శాతం తీరిపోతాయి. ఇక మూడోది మార్కెట్ల చట్టం.. ఈ మూడు పకడ్బందీగా ఉంటే.. రైతులకు ఉచితాలు అవసరం లేదు. భూమి హక్కు భద్రంగా ఉండి.. నాణ్యమైతన విత్తనం చేతికి వచ్చి, లోపం ఉంటే నష్ట పరిహారం వచ్చి… పండిన పంటను మార్కెట్‌లో మోసాలకు తావు లేకుండా అమ్ముకునే అవకాశం ఉంటే.. రైతు ఎందుకు నష్టపోతాడు..?’ అని సునీల్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో సంతోషకరమైన విషయం ఏంటేంటే ఆర్‌వోఆర్ చట్టం వచ్చింది. విత్తన చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. మార్కెట్ చట్టాల్లో కూడా లోపాలు ఉన్నాయి. అవి సవరించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ మూడు కనుక అమలైతే దేశానికి రోల్ మోడల్ అవుతాం. 18 రాష్ట్రాల నుంచి ఆర్‌వోఆర్‌ను అధ్యయనం చేశాక మన ఆర్‌వోఆర్ చట్టం తయారు చేశాం. మనల్ని ఉదాహరణగా తీసుకొని అమలు చేసే విధంగా తయారు చేశాం. విత్తన చట్టం కూడా ఆ మాదిరిగా ఉండేలా తయారు చేస్తున్నాం. భూ భారతి చట్టం ఎలాగైతే అసెంబ్లీకి పోకముందే.. అందరి అభిప్రాయాలను సేకరించి ముసాయిదా తయారైందో ఆ మాదిరిగానే అందర్నీ సంప్రదించిన తర్వాతే విత్తన చట్టం ముసాయిదా తయారు కావాలని నిర్ణయించాం. వచ్చిన ముసాయిదాను కూడా పబ్లిక్ లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాలు సేకరిస్తున్నాం.. వరంగల్, గద్వాల జిల్లాలో పర్యటించాం. రైతులతో మాట్లాడం. విత్తనోత్పత్తి చేసే రైతులతో కూడా మాట్లాడి.. ఒక మంచి ముసాయిదాను తయారు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది’ అని సునీల్ వివరించారు.
ఈ అంశాలు తెరపైకి..
నాణ్యమైన విత్తనం రావాలంటే.. లేబుల్ మీద ప్రభుత్వం సర్టిఫైడ్ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విత్తనాలు అమ్మాలని, ప్రతి విత్తనం పాకెట్ మీద ఎంత దిగుబడి వస్తుందో స్పష్టంగా ఉండాలని చెప్పారు. నష్టం జరిగినప్పుడు నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. పత్తి విత్తనాల చట్టం మాదిరిగానే మిగతా విత్తనాల చట్టం ఉండాలని అంటున్నారని చెప్పారు.
ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించే అధికారం..
‘సాగుకు విత్తనం మూలం. రైతుకు చట్టం తెలియాలి. చట్టంతో అవసరం వచ్చినప్పుడు రైతులకు అండగా నిలబడే వ్యవస్థ ఉండాలి. 100 గ్రామాల్లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ఇవన్నీ పైలట్ ప్రాజెక్టుల కింద కొనసాగుతున్నాయి. ప్రతి రైతు వేదికలో వ్యవసాయ చట్టాల మీద అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల అభిప్రాయాల మేరకు ముసాయిదా ఉంటుంది. ప్రజల ఆశయాలు ప్రతిబింబించే విధంగా చట్టం ఉంటుంది. రశీదు లేకుండా విత్తనం కొనొద్దు.. వివరాలు లేని సంచులతో కూడిన గింజలు కొనొద్దు. ఇవి లేకుంటే నష్ట పరిహారం ఇప్పించడానికి కుదరదు. ఏ స్టేజ్‌లో విత్తనం ఫెయిల్ అయితే అప్పుడు వ్యవసాయ శాఖ అధికారి, డీలర్‌కు సమాచారం ఇవ్వాలి. జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేయాలి. దీనికి మించి వెళ్లాలంటే విత్తన చట్టం మారి.. విత్తన చట్టంలో నష్ట పరిహారం ఇప్పించగలిగే వెసులుబాటు ఉంటే.. అప్పుడు రైతుకు కొంత ఈజీ అవుతుంది. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించే అధికారం వస్తుంది’ అని భూమి సునీల్ పేర్కొన్నారు.