Site icon vidhaatha

వానకాలం సాగు మొదలైనా పెట్టుబడి సాయం ఇవ్వరా … మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

విధాత : వానాకాలం వచ్చినా ఖరీఫ్ పంటల సాగు పనులు మొదలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం రైతుబంధు పంపిణీపై నోరు మెదపడం లేదని బీఆరెస్ మాజీ మంత్రి టి. హరీశ్‌రావు విమర్శించారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న రూ.7500 వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లాలో అక్కెనపల్లిలో రైతు నాగేందర్ కోరిక మేరకు ఆయిల్‌పామ్‌ తొలి పంట కోత పనులను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అయిల్ పామ్ క్రాప్‌ మెయింటెనెన్స్‌ కింద ప్రభుత్వం రైతుకు ఏడాదికి రూ.4200 ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో పామాయిల్‌ పంటపై రైతులు ఆసక్తి చూపించడం లేదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. దగా చేయడం మంచిది కాదని హితవు పలికారు. పచ్చిరొట్ట, జిలుగ, జనుము విత్తనాల సరఫరా చేయని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని మండిపడ్డారు. గత బీరెస్‌ ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

 

Exit mobile version