రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక కొనుగోలు కేంద్రాలలోనే నెల రోజుల పాటు పడిగాపులు పడుతున్న ఘటనలు ధాన్యం కొనుగోలులో రైతన్నల తిప్పలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు నత్తనడక కొనుగోలుతో మండుతున్న ఎండల మద్య తమ వంతు ధాన్యం కొనుగోలు సిరీయల్ కోసం ఎదురుచూపులు..మరోవైపు ఆకస్మికంగా విరుచకపడున్న వానలతో రైతులు కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యం కుప్పల వద్ద అహర్నిశలు పడిగాపులు పడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్న తీరు వారి కష్టాలను వెల్లడిస్తుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో మొక్కజొన్న, వరి ధాన్యం కాంటాలు కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోలు కేంద్రానికి తిరుగుతున్న రైతు వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించడం సమస్య తీవ్రతను చాటింది.
కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం, గన్నీ బ్యాగులు, హమాలీల సమస్యలతో కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం, లారీల కొరత, తరుగు, ఆన్ లోడింగ్ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వరికోతలు సకాలంలో ప్రారంభమవ్వడంతో.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఆయా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఆరబోసుకున్నారు. ఈసారి ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా రైతులు కొందరు నెల రోజుల నుంచి కూడా కేంద్రాల వద్దనే ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నెల రోజులైనా సగం కూడా సాగని కొనుగోలు
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులు కుప్పలు పోసి దాదాపు నెలరోజులు గడిచిపోతున్నా కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం కొనసాగుతుంది. తేమ సాకు, హమాలీల కొరత, గన్నీ బ్యాగులు సమస్య, మిల్లుల కేటాయింపు, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ఎగుమతి,అన్‌లోడింగ్ ఇబ్బందులు, వంటి అనేక సమస్యలతో యాసంగి వరి ధాన్యం కొనుగోలులో నత్తనడకన సాగుతుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మంత్రులు, కలెక్టర్లతో సమీక్షలు చేసిన..మంత్రులు జిల్లాల్లో పర్యటించిన కొనుగోలు ప్రక్రియలో వేగం కొరవడింది. ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నామన్న రాష్ట్రా పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుల మాటలు క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రధానంగా నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. తేమ శాతం ఇతర నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సిద్ధం చేసినా కూడా కాంటా వేయడంలో కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కొన్నిచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో ధాన్యాన్ని ఇంకా కాంటా వేయడం లేదని పేర్కొంటున్నారు. తేమ, తాలు వంటి వాటి పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను తిప్పలు పెడుతున్నారు.
టార్గెట్ 80లక్షల మెట్రిక్ టన్నులు..కొన్నది 39లక్షల టన్నులే…
తెలంగాణ నుండి యాసంగి ధాన్యం సేకరణలో భాగంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. అయితే తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడంతో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని స్వయంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం 8,575 కొనుగోళ్ల కేంద్రాలను ఐకేపీలు, సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించి, 1800 రైసు మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.5000 కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ చేసినట్లుగా తెలిపారు. 48 నుంచి 72 గంటల్లో డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పటిదాక ప్రభుత్వం నిర్దేశించుకున్న యాసంగి ధాన్యం కొనుగోలు లక్ష్యాలలో సగం కూడా పూర్తి చేయలేదని వెల్లడవుతుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కోసం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, పది రోజుల పాటు జిల్లాలోని లారీలు, డీసీఎంను ధాన్యం లిఫ్టింగ్ కే వినియోగించాలని ఆదేశించామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఆఖరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల నెలకొనడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతు అన్నదాతలను అరిగోస పెడుతుంది. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 6,500 లారీలను సిద్ధం చేశామని, ధాన్యం నిల్వ కోసం ముందస్తుగా 20 కోట్ల గన్నీ సంచులను సిద్ధంగా ఉంచామని మంత్రి చెప్పినా..కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం డబ్బులు 48గంటల లోపు జమ అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెబుతుండగా..20నుంచి 30రోజులైన డబ్బులు పడటం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.
అన్నీ అవస్థలే..
గ్రేడ్-1 రకాన్ని రూ.2,389 మద్దతు ధరతో కొనాల్సి ఉన్నా.. రూ.20 తక్కువతో సాధారణ ధాన్యం(రూ.2300) కేటగిరీలోనే కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్న రకాలకు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తుండడంతో క్వింటాకు రూ. 2,820 వరకు ధర అందుతోంది. అయితే కొనుగోలు కేంద్రాలలో తరుగు, తాలు పేరిట నిర్ణీత బరువును మించి ప్రతి బస్తాకు ఎక్కువగా తూకం వేస్తుండటంతో రైతు ఆర్థికంగా నష్టపోతూ శ్రమ దోపిడీకి గురవుతున్నాడు. మిల్లుల్లోనూ బరువు తక్కువ వస్తుందని మళ్లీ సంచికి కిలో చొప్పున అదనంగా కోతపెడుతూ రైతు జేబుకు చిల్లు పెడుతున్నారు. లారీల కొరత ప్రధాన సమస్యగా మారింది. మిల్లుకు ధాన్యంతో వెళ్లినవి తిరిగి కల్లాలకు రావడానికి మూడు రోజులు పడుతోంది. స్థానికంగా గ్రామాల్లోని ట్రాక్టర్లను సర్దుబాటు చేసినా.. ఇవి కూడా మిల్లుల బయట గంటల తరబడి అన్‌లోడింగ్ కోసం ఉంచాల్సి వస్తోంది. అధికారులు మిల్లర్లతో సమన్వయం చేసుకుని రోజువారీగా కొనుగోళ్ల ప్రక్రియను మరింతగా పెంచితేనే ఇబ్బందులు తప్పుతాయని రైతులు చెబుతున్నారు.
15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యేనా..?
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఈనెల 25 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత, ట్రాన్స్ పోర్టు సమస్య, మిల్లులకు ధాన్యం కేటాయింపులలో తేడాలు, మిల్లర్ల వద్ద అన్ లోడింగ్ సమస్యలు ధాన్యం కొనుగోలు ప్రక్రియను జాప్యం చేస్తున్నాయి. మరోవైపు మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్‌కు సంబంధించి ఇబ్బందులు వస్తున్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకుని కొనుగోలు వేగవంతం అయ్యేలా చూడాలంటున్నారు. అన్‌లోడింగ్‌లో సమస్య వస్తున్నందున ప్రతి మిల్లుకూ ప్రత్యేక అధికారిని నియమించి వేగంగా అన్‌లోడ్ అయ్యేలా చూడాలని మంత్రులు సైతం ఆదేశించారు. అయితే మిల్లర్లు మాత్రం గత వానకాలం సీజన్‌కు సంబంధించి మిల్లర్లు సీఎంఆర్ ఇప్పటివరకు 45 శాతం మాత్రమే ఇవ్వడం అన్ లోడింగ్ సమస్యకు దారితీస్తుంది. సీఎంఆర్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తే మిల్లుల వద్ద ధాన్యం నిల్వలకు మరింత స్థలం దొరుకుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో తీసుకున్న ధాన్యం ఇంకా ఉన్నందునా అనుకున్న స్థాయిలో మిల్లర్లు ఆన్ లోడింగ్ కు సుముఖత చూపడం లేదు.
గత సీజన్ నిలువలు మిల్లులో
గత వానాకాలం నాటి సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిలువలే ఇంకా మిల్లుల్లో ఉన్నాయి. కొత్తగా వస్తున్న నిలువలను ఎక్కడ నిలువ చేయాలంటూ కొందరు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. గత సీజన్‌లో ఒక్కొక్క రైస్‌మిల్లుకు మూడు వందల నుంచి నాలుగు వందల లారీల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో దాదాపు వంద లారీల బియ్యం మాత్రమే తాము ఎఫ్‌సీఐకి అప్పగించామని, ఇంకా తమ మిల్లుల్లో రెండు వందల నుంచి మూడు వందల లారీల ధాన్యం నిల్వ ఉందని మిల్లర్లు వాపోతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుని నిలువ చేయడం సమస్యగా మారిందంటున్నారు. మిల్లుల్లోని గోదాముల్లో ధాన్యం నిలువలు నిండిపోయి మిల్లు ఆవరణలో ఖాళీ లేకుండా నిలువ చేస్తున్నారు. ప్రస్తు తం జిల్లాలలో ఉన్న గోదాంలు గత యాసంగి, ఖరీఫ్ సీజన్ ధాన్యంతో నిండిపోయి ఉన్నాయి. వరి ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో గోదాంలు ఖాళీగా లేకపోవడం అత్యంత తీవ్రమైన సమస్యగా పరిణమించింది
మరోవైపు కొన్ని జిల్లాల్లో ఒకేసారి ధాన్యం కొనుగోళ్లు మరో వైపు మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో వాహనాల కొరత, గోదాంల కొరత ఏర్పడుతుంది. దీంతో నాలుగైదు శాఖలతో సమన్వయ పరుస్తూ వాహనాలను, గోదాంలను సమకూర్చడం అధికారులకు సవాల్ గా తయారైంది. ఇటు మక్కల కొనుగోళ్లు అటు ధాన్యం కొనుగోళ్లును పర్యవేక్షించడం అధికారులకు కత్తిమీద సాముగా పరిగణమించింది. మొత్తం మీద కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా యాసంగి ధాన్యం కొనుగోలు సాగక..అన్నదాత అవస్థలు కూడా ఉన్నాయని రైతు సంఘాలు ఘోషిస్తున్నాయి. ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులపై దృష్టి పెట్టి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి రైతులు అకాల వర్షాలతో నష్టపోకుండా చూడాలని, చెప్పినట్లుగా 48గంటల్లో డబ్బులు జమచేయాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
కేరళం సీఎంగా వీ.డీ. సతీశన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్ నగరంలో 22 ప్రధాన రోడ్ల విస్తరణకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు
