- గవర్నింగ్ బాడిలో ఒక్కరికే చోటు
- విమర్శలొస్తే ప్రజలకేమి చెబుతారు
విధాత ప్రత్యేకం: వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 57 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎంతో దూరదృష్టితో, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో తెలంగాణ నుంచి పారిశ్రామిక రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందినవారికి చోటివ్వకపోవడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు పెద్దపీట వేసి తెలంగాణ వాసన లేకుండా చేశారు. విద్య, ఉపాధి మధ్య నైపుణ్య అంతరాన్ని తొలగించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనేక దేశాలలో యూనివర్సిటీల ఏర్పాటును అధ్యయనం చేసిన తరువాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును రూపొందించి గతేడాది జూలే నెలలో అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ముచ్చర్లలో పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి సమయం పట్టనుండడంతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో ఆరు కోర్సులతో ప్రారంభించారు.
మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సర్టిఫికేట్ కోర్సులు, రెండు నుంచి మూడు సంవత్సరాల డిప్లొమా, డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. గతంలో స్థాపించిన ప్రైవేటు యూనివర్సిటీల మాదిరి కాకుండా స్కిల్ యూనివర్సిటీలో ఎస్‌సి, ఎస్‌టి, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ వర్గాల వారికి ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా చేస్తారు. హబ్ అండ్ స్పోక్ నమూనాలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనుసరిస్తుంది. హబ్ విశ్వ విద్యాలయంగా, స్పోక్ జిల్లాలో నైపుణ్య కేంద్రాలుగా ఉండనున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్ దేశం పర్యటించింది. సింగపూర్ లోని ఐటిఈ స్కిల్ యూనివర్సిటీ తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్ధేశ్యం, లక్ష్యాలు బాగున్నప్పటికీ తెలంగాణ వాసులకు ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత లేకపోవడం ఆవేదనకు గురి చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత కూడా ఇతర రాష్ట్రాల వారి పెత్తనం ఇంకా పోవడం లేదనే ఆందోళన బలపడుతోంది. బోర్డు ఆఫ్ గవర్నర్స్ లో పేర్లను ఒకసారి పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఆనంద్ మహీంద్రా (మహీంద్రా గ్రూపు), శ్రీనివాస రాజు (ఇన్వెస్టర్), మనీష్ సబర్వాల్ (టీమ్ లీజు సర్వీసెస్), సంజీవ్ బిక్‌చందనా (ఇన్ఫో ఎడ్జ్), కల్లం సతీష్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్), డాక్టర్ సుచిత్ర ఎల్లా (భారత్ బయోటెక్), ఎంఎం మురుగప్పన్ (మురుగప్పా గ్రూప్), కేపీ కృష్ణన్ (మాజీ ఐఏఎస్), డాక్టర్ పగిడిపాటి దేవయ్య (పారిశ్రామికవేత్త), వీఎల్‌వీఎస్ఎస్ సుబ్బారావు ( మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు) లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి కే.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా ఉన్నారు. ఇక వైస్ ఛాన్సలర్ గా వీఎల్‌వీఎస్ఎస్ సుబ్బారావు, ఇన్‌ఛార్జీ రిజిస్ట్రార్ గా ఛమన్ మెహతా కొనసాగుతున్నారు.
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో ఒక్క పగిడిపాటి దేవయ్య మాత్రమే తెలంగాణ వాసి. డాక్టర్ దేవయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఖిలాషాపూర్ లో జన్మించి, హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం యూఎస్ఏ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మిగతా వారంతా ఇతర రాష్ట్రాల వారే కావడం తెలంగాణ లోని పారిశ్రామికవేత్తలను అవమానానికి గురి చేస్తున్నది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో విశేష అనుభవం, ధాతృత్వ గుణం కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు స్వచ్ఛంధంగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాలలో పాల్గొనేందుకు, తమవంతు సేవలు అందించేందుకు ఏమాత్రం వెనకాడరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు లు పక్కా తెలంగాణ వాసులు అయినా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ ప్రాంతంవారికి మొండిచేయి లభించందనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంవారికి అన్యాయం, అవమానం జరుగుతున్నదని పలు వేదికలపై విమర్శలు గుప్పించిన ఈ ఇద్దరు అధికారంలోకి వచ్చిన తరువాత నాటి మాటలను గుర్తుపెట్టుకోకపోవడం నిఖార్సయిన తెలంగాణ వారిని ఆవేదనకు గురిచేస్తున్నది.