Mamata Banerjee । న్యాయం కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ఒక ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో నిరవధిక నిరసనకు దిగిన డాక్టర్లతో గురువారం సమావేశం జరగాల్సి ఉన్నది. బుధవారం కూడా డాక్టర్లు ఆ సమావేశానికి హాజరుకాలేదు. గురువారం కూడా తమ నిరసన కొనసాగిస్తూ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ సంచలన ప్రకటన చేశారు.
ఆర్‌జీ కర్ ఉదంతంపై ఆందోళనలు చేస్తున్న వైద్యులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మమతా బెనర్జీ తన ప్రకటనలో తెలిపారు. ‘చాలా మంది వైద్యులు సమావేశం పట్ల ఆసక్తితో ఉన్నారని నాకు తెలుసు. కానీ కొద్ది మంది మాత్రం చర్చల్లో ప్రతిష్టంభన కోరుకుంటున్నారని మాకు తెలిసింది’ అని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నవని మమతా బెనర్జీ ఆరోపించారు. వీటి వెనుక వామక్షాలు ఉన్నాయని విమర్శించారు. అయితే.. ఈ విషయంలో ఆమె ఎలాంటి ఇతర వ్యాఖ్యలు చేయలేదు. ‘సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతుందంటే అవసరమైతే నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ.. వారికి న్యాయం అవసరం లేదు. వాళ్లకు కుర్చీ మాత్రమే కావాలి’ అని మమత తన ప్రకటనలో పేర్కొన్నారు.
వరుసగా మూడో రోజు కూడా చర్చలు సాగకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆందోళన చేస్తున్న వైద్యులకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్నది. ఆందోళన చేస్తున్న డాక్టర్లను కలుసుకునేందుకు తాను సచివాలయంలో రెండు గంటల పాటు ఎదురు చూశానని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని మమత తెలిపారు. సమావేశంలో పాల్గొనేందుకు ఆందోళన చేస్తున్న డాక్టర్ల ప్రతినిధులు సచివాలయానికి వచ్చారు కానీ.. సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించారు.
ఇది తాజా వార్త.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది..