Henley Passport Index 2024 | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది. అగ్రదేశాలకు చెందిన పాస్‌పోర్టులను వెనక్కి నెట్టి సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత పాస్‌పోర్టు 82వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెన్లీ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. జాబితాలో సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ సహాయంతో పౌరులు వీసా లేకుండానే 227 గమ్యస్థానాల్లో 195 దేశాల్లోకి ప్రవేశించేందుకు వీలుంటుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం.. భారతీయ పాస్‌పోర్ట్ 2024 సంవత్సరంలో 82వ స్థానంలో ఉన్నది. గతేడాదితో పోలిస్తే రెండు పాయింట్లు తగ్గింది. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తులు 58 దేశాల్లో వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇదే జాబితాలో పొరుగుదేశమైన పాకిస్థాన్ పాస్‌పోర్టక్ష కేవలం 33 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. పాకిస్థాన్ గతేడాది 106వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 100వ స్థానానికి చేరుకున్నది.
టాప్ టెన్ జాబితా ఇదే..
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నది. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాల పాస్‌పోర్టులున్నాయి. ఆయా పాస్‌పోర్టులతో 192 దేశాలకు వీసా లేకుండానే వెళ్లవచ్చు. టాప్-3లో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 191 దేశాలను వీసా లేకుండా చుట్టిరావొచ్చు. నాలుగో స్థానలో బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే ఉండగా.. 190 దేశాలకు వెళ్లొచ్చు. ఐదోస్థానంలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాస్‌పోర్టులున్నాయి. ఆయా పోస్టులున్న వారంతా 189 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఆరోస్థానంలో గ్రీస్, పోలాండ్ ఉండగా.. 188 దేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఏడోస్థానంలో కెనడా, చకియా, హంగరీ, మాల్టా ఉన్నాయి. వీటితో 187 దేశాలకు వెళ్లొచ్చు. ఎనిమిదో స్థానంలో అమెరికా పాస్‌పోర్ట్ ఉండగా.. 186 దేశాలను చుట్టిరావొచ్చు. తొమ్మిదో స్థానంలో ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. పదో స్థానంలో ఐస్‌లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా ఉండగా.. ఆయా దేశాల పాస్‌పోర్టులతో 184 దేశాల్లో వీసా లేకుండానే వెళ్లి రావొచ్చు.