Kerala Tour | హౌస్‌బోట్‌లో ప్రయాణం.. తేయాకు తోటల అందాలను వీక్షించొద్దామా..? ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ..!

Kerala Tour | వేసవి సెలవులు తుదిదశకు చేరాయి. మరికొద్దిరోజుల్లోనే విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దాంతో చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్లిరావాలని భావిస్తుంటారు. సమ్మర్‌ సెలవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది.

  • Publish Date - May 28, 2024 / 01:00 PM IST

Kerala Tour | వేసవి సెలవులు తుదిదశకు చేరాయి. మరికొద్దిరోజుల్లోనే విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దాంతో చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్లిరావాలని భావిస్తుంటారు. సమ్మర్‌ సెలవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. దేవభూమి పేరొందిన కేరళలోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నది. ‘ఎక్సోటిక్‌ కేరళ విత్‌ హౌస్‌ బోట్‌ స్టే’ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఐదురోజులు నాలుగు రాత్రులు పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా త్రివేండ్రం చేరుకొని అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీలో పర్యటన మొదలుపెట్టొచ్చు.

ప్రయాణం కొనసాగేదిలా..

తొలిరోజు త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌, రైల్వేస్టేషన్‌, కొచువెలి రైల్వేస్టేషన్ల నుంచి పర్యాటకులను పికప్‌ చేసుకుంటారు. ఆ తర్వాత కోవలం, త్రివేండ్రంలోని హోటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. హోటల్‌కు చేరాక కొంతసేపు విశ్రాంతి తీసుకొని భోజనం అనంతరం సాయంత్రం అజిమల శివ దేవాలయం సందర్శ ఉంటుంది. ఇక్కడ 58 అడుగుల శివుడి భారీ విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత కోవలం బీచ్‌ సందర్శనకు వెళ్తారు. రాత్రి త్రివేండ్రంలోనే బస ఉంటుంది. ఇక రెండోరోజు పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత కుమరకోమ్‌ చేరుతారు. అక్కడ కేరళ బ్యాక్‌ వాటర్‌ క్రూజ్‌లో హౌస్‌ బోట్‌లో ప్రయాణం ఉంటుంది. బోట్‌ హౌస్‌లోనే టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ ఏర్పాటు చేస్తారు. రాత్రి బస బోట్‌లోనే ఉంటుంది.

మూడో రోజు ఉదయం తేక్కడి బయలుదేరాల్సి ఉంటుంది. మార్గమధ్యంలోనే తోటలను సందర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి హోటల్‌కు వెళ్తారు. అక్కడి బోటింగ్‌ చేయవచ్చు. రాత్రి తేక్కడిలోనే బస చేస్తారు. నాలుగోరోజు ఉదయం మున్నార్‌కి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ తేయాకు తోటలు, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్‌, ఎకో పాయింట్‌, కుండాలా డ్యామ్‌ లేక్‌ను సందర్శిస్తారు. రాత్రి మున్నార్‌లోనే బస ఉంటుంది. ఐదోరోజు ఉదయం ఎరవికులమ్‌ నేషనల్‌ పార్క్‌ సందర్శన ఉంటుంది. అనంతరం కొచ్చికి ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌, ఎర్నాకులం రైల్వేస్టేషన్‌లలో డ్రాప్‌ చేయడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ విషయానికి వస్తే..

ఈ పర్యటన రోడ్‌పై కొనసాగుతున్నది. కంఫర్ట్‌ క్లాస్‌లో మే 31 వరకు బుక్‌ చేసుకుంటే.. సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.52,430 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.26,940.. ఇక ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.20,120 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు బెడ్‌తో కలిసి రూ.6,6790.. బెడ్‌ వద్దనుకుంటే రూ.4040 చెల్లిస్తే సరిపోతుంది. జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 27 వరకు బుక్‌ చేసుకుంటే.. సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.51,190, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.26,335, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.19,675 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇక ప్రయాణం ఏసీ వాహనాల్లో ఉంటుంది. అలాగే ఏసీ హోటల్‌లో బస కల్పిస్తారు. దాంతో పాటు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సైతం ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి.

Latest News