Nature Viral Video | పిల్ల పక్షి చిన్న వీడియో.. పెద్దలకు మాత్రం పెద్ద సందేశం!

రెక్కలు వచ్చాక.. ఎగిరే శక్తి ఉన్నాక.. ఇంకా ఎవరో ఆహారాన్ని తెచ్చిపెడతారని ఆశిస్తే.. పాపం ఈ మైనాకు ఎదురైనా పరిస్థితే ఎదురవుతుంది. మనుషుల్లో కూడా!!

Nature Viral Video | మన పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని తపించిన తల్లిదండ్రులు ఉండరు! తామేదో కష్టాలు పడి పెరిగామని, తమ పిల్లలైనా ఆ కష్టాలకు దూరంగా ఉండాలని ఆశించడం కన్నప్రేమ లక్షణం. అందుకే అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏది అడిగినా కాదనరు. అన్నీ నోటి దగ్గరకు తీసుకొచ్చి మరీ పెడతారు. పిల్లాడిని స్కూలు దగ్గరో, లేదా స్కూలు బస్సు ఆగే ప్రాంతంలోనో విడిచిపెట్టి.. ఆ బస్సు వెళ్లిపోయేదాకా అలా చూస్తూ ఉంటారు. ఇక సాయంత్రం స్కూలు బస్సు వచ్చే సమయానికి రిసీవ్‌ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇల్లు దగ్గరే కదా.. వాళ్లే వచ్చేస్తారులే అనుకోరు. అమ్మో.. వారికి ఏమైనా జరిగితే? అని భయపడతారు. ఇదే ఓవర్‌ పేరెంటింగ్‌ అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను స్వేచ్ఛగా పెరగనీయాలని, వారి పనులు వారే చేసుకునేలా వారిని తయారు చేస్తే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని పిల్లలే స్వయంగా అధిగమిస్తారని అంటున్నారు. లేనిపక్షంలో ఎవరో వస్తారని, తమ పని చేసి పెడతారని పిల్లలు ఒక అమాయక ధోరణిలో పడిపోయి.. తెలివితేటలను ఉపయోగించలేని స్థితికి వెళిపోయే ప్రమాదం లేకపోలేదు. పిల్లలు కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత తమ పనులు తాము చేసుకోవడం, తమ సమస్యలను తామే అధిగమించడం, తమ డబ్బు తామే సంపాదించుకోవడం నేర్చుకోక తప్పదు. సరిగ్గా దీనికి పక్షి ప్రపంచంలో జరుగుతున్న విషయాలను లింకు చేసేలా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక పిల్ల పక్షి.. బహుశా మైనా అయి ఉంటుంది. తన ముందు కదులుతూ ఉన్న పురుగు దానంతట అదే తన నోట్లోకి వచ్చేస్తుందని భావిస్తుంటుంది. అందుకే నోరు తెరిచి.. దానిని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. నిజానికి ఆ పిల్ల పక్షి.. గూట్లో ఉన్న సమయంలో తన తల్లి.. ఎక్కడెక్కడి నుంచో పురుగులను అదేనండీ.. ఆహారాన్ని తీసుకువచ్చి.. నోళ్లు తెరిచి ఉన్న పిల్ల పక్షులకు అందిస్తుంది. ఇదే అలావాటైందేమో.. ఆ పిల్ల మైనా.. తాను తోరు బార్లా తెరిచి పెడితే.. ఆటోమేటిక్‌గా ఆ పురుగు తన నోట్లోకి వచ్చేస్తుందనే మాయలో ఉంటుంది. ఇలా రెండు మూడుసార్లు నోరు తెరిచినా ఆ పురుగు మాత్రం పిల్లపక్షి నోట్లోకి రాదు.

వాస్తవానికి వీటిపై అధ్యయనాలూ పెద్ద ఎత్తునే సాగాయి. పక్షులకు రెక్కలు ఎగరడానికి అనుకూలంగా లేనంత వరకూ తల్లి వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే.. అది ఎక్కువ కాలం కొనసాగి.. పక్షులు తమంతట తాముగా ఆహారాన్ని అన్వేషించుకోవడంలో జాప్యం జరిగితే.. అటువంటి కేసులలో ఎగిరే శక్తి ఉండి కూడా చనిపోతున్న పక్షులు 17 శాతం నుంచి 50 శాతం వరకూ ఉన్నాయని 2021లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అవి ఆకలి తట్టుకోలేక, లేదా ఇతర జీవులకు ఆహారంగా మారి చనిపోతుంటాయని తేలింది.